కోల్‏కత్తా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కోల్‏కత్తా వైద్యురాలి హత్యాచార కేసులో నిందితుడికి జీవిత ఖైదు

కోల్‎కత్తా: దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న కోల్‎కత్తా జూనియర్ వైద్యురాలి కేసులో సీల్ధా జిల్లా కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‎ను దోషిగా తేల్చిన సీల్ధా కోర్టు.. 2025, జనవరి 20వ తేదీన నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. బీఎన్ఎస్ 64, 66, 103/1 సెక్షన్ల కింద దోషి సంజయ్ రాయ్‎కు జీవిత ఖైదు విధించింది. దోషిని చనిపోయే వరకు జైల్లోనే ఉంచాలని ఆదేశించిన కోర్టు.. సంజయ్ రాయ్‎కు రూ.50 వేల జరిమానా విధించింది. 

అలాగే.. బాధిత ఫ్యామిలీకి రూ.17 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. నిందితుడికి ఉరి శిక్ష విధించాలని.. ఇది చాలా అరుదైన కేసు అని సీబీఐ కోరగా.. సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు సంజయ్ రాయ్‎కు ఉరి శిక్ష కాకుండా జైలు శిక్ష విధించాలని నిందితుడి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశాడు. ఇరు వర్గాల వాదనలు విన్న సీల్ధా కోర్టు.. దోషి తరుఫు లాయర్ వాదనలతో ఏకీభవించి జీవిత ఖైదు విధించింది. 

కేసు ఏంటంటే..?

2024, ఆగస్ట్ 9వ తేదీన కోల్‎కత్తాలోని ఆర్జీకర్ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికంగా హత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. డ్యూటీలో ఉన్న జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసింది అదే ఆసుపత్రిలో సివిక్ వాలంటీర్‎గా పని చేసే సంజయ్ రాయ్‎గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు 2025, ఆగస్ట్ 10న నిందితుడు సంజయ్ రాయ్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కోల్‎కత్తా హైకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారణ చేపట్టింది. మొత్తం 120 మంది సాక్ష్యులను విచారించిన సీబీఐ.. బలమైన సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించింది. నిందితుడు సంజయ్ రాయ్‎కు పాలిగ్రాఫ్ టెస్ట్ సైతం నిర్వహించింది. సంజయ్ రాయ్‎కు వ్యతిరేకంగా సీబీఐ కోర్టుకు బలమైన ఆధారాలు సమర్పించింది. సీబీఐ సాక్ష్యాల ఆధారంగా సీల్దా కోర్టు సంజయ్ రాయ్‎ను దోషిగా తేల్చింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది.