సంజయ్ సింగ్‌కు అక్టోబర్ 27 వరకు కస్టడీ పొడగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్  కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ నేత సంజయ్ సింగ్‌కు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు  అక్టోబర్ 27 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.  కస్టడీ గడువు నేటితో  ముగియడంతో సంజయ్  సింగ్‌ను  కోర్టు ముందు హాజరుపరచారు ఈడీ  అధికారులు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన కోర్టు..   అక్టోబర్ 27 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.   

కోర్టు హాలులో  గౌతమ్ అదానీ పేరును  సంజయ్ సింగ్ ప్రస్తావించారు. అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చర్య తీసుకోలేదని సింగ్ కోర్టు ముందు పేర్కొన్నారు. దీంతో  న్యాయమూర్తి MK నాగ్‌పాల్ సీరియస్ అయ్యారు.  కేసుకు  సంబంధం లేని విషయాలను ఇక్కడ తీసుకురాకూడదని,  అదానీ,  మోదీపై ప్రసంగం చేయాలనుకుంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కేసును విచారిస్తామని తెలిపింది. 

మనీలాండరింగ్ కేసులో  అక్టోబర్‌ 4న ఆప్ ఎంపీ సంజయ్‌ సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది.  ఢిల్లీ లిక్కర్ స్కామ్ అమలు చేయడంలో సంజయ్  సింగ్ కీలక పాత్ర పోషించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. మరోవైపు  స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్తలు రచించిన 16 పుస్తకాలను అనుమతించాలని కోరుతూ సంజయ్   సింగ్ తరపు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. జైలు నిబంధనల ప్రకారం పుస్తకాలు, మందులు తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతించింది.

ALSO READ : 9 రోజులు..9 రకాల పేర్లు..8 నైవేద్యాలు.. అక్టోబర్ 14 నుంచి బతుకమ్మ పండగ