అర్ధరాత్రి బండి సంజయ్​ అరెస్ట్... కారణం చెప్పకుండా లాక్కెళ్లిన పోలీసులు

  • అడ్డుకున్న కుటుంబ సభ్యులు, కార్యకర్తలు
  • కరీంనగర్​లో ఎంపీ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత

 కరీంనగర్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక కరీంనగర్​లోని సంజయ్ ఇంటిని చుట్టుముట్టిన పోలీస్ బలగాలు.. ఆయనను బలవంతంగా అదుపులోకి తీసుకున్నాయి. తనను ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో చెప్పాలని, వారెంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తున్నారని సంజయ్ ప్రశ్నించినా వినిపించుకోలేదు.ఆయనను బలవంతంగా లాక్కెళ్లారు.

సంజయ్​ను తీసుకెళ్లకుండా కుటుంబ సభ్యులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వారితో వాగ్వాదానికి దిగారు. కార్యకర్తలను పోలీసులు ఈడ్చిపడేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సంజయ్ అత్తమ్మ చనిపోయి బుధవారానికి 9వ రోజు కావడంతో.. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇంటికి చేరుకున్న కొద్దిసేపటికే ఈ ఘటన జరిగింది. పేపర్ లీకేజీ విషయంలో బుధవారం ఉదయం 9 గంటలకు ప్రెస్ మీట్ పెట్టేందుకు సంజయ్ సిద్ధం కావడంతో ఆయనను పోలీసులు అర్ధరాత్రే అరెస్ట్ చేశారని తెలిసింది.