నిజామాబాద్, వెలుగు: కాంగ్రెస్ పార్టీ మాజీ నేత డి. శ్రీనివాస్ ఘర్‌వాపసీతో జిల్లా బీఆర్ఎస్లో బుగులు మొదలైంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న డీఎస్ ఎట్టకేలకు ఆదివారం కాంగ్రెస్‌లో చేరడంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్‌గా ఓ వెలుగు వెలిగిన డీఎస్ రీ ఎంట్రీ తో జిల్లాలో పార్టీల బలా బలాలు మారుతాయన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎన్నికలకు ఏడు నెలలే గడువు ఉండడం, బీఆర్ఎస్ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో డీఎస్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ కు ప్రతికూలంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కో ఆర్డినేషన్‌లో కీ రోల్..
సీనియర్‌నేత డీఎస్ ఆయన పెద్ద కొడుకు సంజయ్ ఆదివారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ సమక్షంలో పార్టీలో చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా 2004, 2009 ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన డీఎస్‌కు మంచి సమన్వయ కర్తగా పేరుంది. ప్రస్తుతం అనారోగ్య కారణాలతో డీఎస్వీల్చైర్కు పరిమితమైనా.. పార్టీలో సీనియర్లు, అసమ్మతి నేతల మధ్య సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని కాంగ్రెస్ హైకమాండ్భావిస్తోంది.
అర్వింద్‌కు సహకరిస్తున్నారని..
త చిన్న కుమారుడు అర్వింద్ కు సహకరిస్తున్నారని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అప్పటి నిజామాబాద్ ఎంపీ కవిత పార్టీ హైకమాండ్‌కు కంప్లైంట్చేశారు. డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. ఈ పరిణామాలతో డీఎస్బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. కానీ 2019 లో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా బరిలో దిగిన అర్వింద్ గెలుపులో డీఎస్ కీలక భూమిక పోషించారు.
5 అసెంబ్లీ స్థానాల్లో ప్రభావం
ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, ఐదింటిలో బీసీల్లో కీలకమైన మున్నూరు కాపు సామాజిక వర్గం అభ్యర్థులు గెలుస్తున్నారు. నిజామాబాద్‌అర్బన్, నిజామాబాద్‌రూరల్, బోధన్ , ఆర్మూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంది. ఆర్మూర్, నిజామాబాద్‌రూరల్ నుంచి బాజిరెడ్డి , అర్బన్ నుంచి మూడు సార్లు డీఎస్, ఎల్లారెడ్డి నుంచి మూడు సార్లు నేరెళ్ల ఆంజనేయులు గెలుపొందారు.
2015 లో డీఎస్ బీఆర్ఎస్లో చేరడంతో మున్నూరు కాపులు కాంగ్రెస్ కు దూరమైనట్లు స్పష్టంగా కనిపించింది. 2018 ఎన్నికల్లో మున్నూరు కాపు వర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్రూరల్, ఎల్లారెడ్డి నుంచి జాజాల సురేందర్ గెలిచారు. 2019 ఎన్నికల్లో మున్నూరు కాపు కు చెందిన అర్వింద్ నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఈ నేపథ్యంలో కాపు ఓటర్లు ప్రాబల్యం ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ బలోపేతానికి డీఎస్ వ్యూహారచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కేడర్ ను బుజ్జగించే పనిలో బీఆర్ఎస్..
2015లో డీఎస్ కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడంతో ఆయన అనుచరులు కూడా భారీ సంఖ్యలో వెంట నడిచారు. ఆ తరువాత బీఆర్ఎస్లో ఇమడలేని కొంత మంది డీఎస్అనుచరులు 2019లో ఆయన చిన్న కుమారుడు అర్వింద్ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఇప్పుడు వారు కూడా కాంగ్రెస్పార్టీలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డీఎస్ వెంట ఉద్యమ నేతలు పదవులు ఆశించి నిరాశపడ్డ నేతలు వెళ్లకుండా బుజ్జగించే పనిలో బీఆర్ఎస్లీడర్లు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.