
కంగ్టి, వెలుగు: బీఆర్ఎస్సోళ్లు ఎక్కడైనా సర్కారు భూములు కబ్జా చేస్తే యాక్షన్ తీసుకోవాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి తహసీల్దార్ విష్ణు సాగర్, డీటీ జుబేర్ ను ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ఖజానా ఖాళీ చేసి కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ లీడర్లు ఓట్ల కోసం వస్తే తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత సర్కారు హయాంలో అవినీతి తప్ప అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సిద్దేశ్వరాలయం వరకు రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. ఎస్సీ కాలనీలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. కంగ్టిలో 5ఎకరాల సర్కారు భూమి ఉంటే 132కేవీ సబ్ స్టేషన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ధరణి బాధితులకు న్యాయం చేస్తామని మాట ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్లు సురేఖ, పల్లవి రాథోడ్, కాంగ్రెస్లీడర్లు పాల్గొన్నారు.
నారాయణ్ ఖేడ్: పార్టీలకతీతంగా ప్రభుత్వం అర్హులందరికీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పట్లోల సంజీవ రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ మండలం గంగపూర్, తూర్కపల్లి గ్రామాల్లో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి, గంగాపుర్ సర్పంచ్ శ్రీనివాస్, తుర్కపల్లి సర్పంచ్ స్రవంతి, రమేశ్ చౌహన్ పాల్గొన్నారు.