
నారాయణ్ ఖేడ్, వెలుగు: పార్టీ బీ ఫామ్ రాకపోతే ప్రజల బీ ఫామ్ తో ఘన విజయం సాధిస్తానని నారాయణఖేడ్ కాంగ్రెస్ లీడర్ టీసీసీసీ వైస్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని ప్రకటించిందని, అన్ని సర్వే రిపోర్ట్స్ తనకి అనుకూలంగా ఉన్నప్పటికీ చివరి నిమిషంలో టికెట్ కేటాయించకపోవడం బాధాకరమన్నారు.
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభించిన బీఆర్ఎస్ ప్రభుత్వంపై కార్యకర్తలందరి సహకారంతో ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. కార్యకర్తల కోరిక మేరకు రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.