భారత క్రికెట్ లో మోస్ట్ అన్ లక్కీ ప్లేయర్ గా సంజు శాంసన్ కి పేరుంది. టాలెంట్ ఉన్నా అడపాదడప అవకాశాలతో సరిపెట్టేస్తున్నారని ఈ కేరళ ఆటగాడిపై చాలా మంది సింపతీ చూపిస్తున్నారు. ఆసియా కప్ లో రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేసి మళ్లీ వెనక్కి పంపించేశారు. ఇక వరల్డ్ కప్ లో అసలు పట్టించుకొనే లేదు. అయితే ఐపీఎల్ లో మాత్రం సంజు తన ఉనికిని చాటుతున్నాడు. రాజస్థాన్ కెప్టెన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆల్ టైం రికార్డ్ బీరేజ్ చేశాడు.
భారత క్రికెటర్లలో సిక్సులు అలవోకగా కొట్టగలిగే వారిలో ధోనీ, రోహిత్ శర్మ ముందు వరుసలో ఉంటారు. వీరి తర్వాత కోహ్లీ, రైనా అందరికీ గుర్తొస్తారు. కానీ ఈ స్టార్ ఆటగాళ్లను మించి సంజు సిక్సులు కొట్టగలదని అతని గణాంకాలే చెబుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో వేగంగా 200 సిక్సులు పూర్తి చేసుకున్న భారత ప్లేయర్ గా సంజు శాంసన్ రికార్డ్ సృష్టించాడు. 159 మ్యాచ్ ల్లోనే సంజు ఈ ఫీట్ అందుకున్నాడు. మంగళవారం (మే 7) ఢిల్లీ క్యాపిటల్స్ పై తొలి సిక్స్ కొట్టడంతో సంజు ఐపీఎల్ కెరీర్ లో 200 సిక్సులు పూర్తి చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ లో మొత్తం 6 సిక్సర్లు బాదిన సంజు..46 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేరిట ఉంది. మాహీ 165 మ్యాచ్ ల్లో 200 సిక్సులు పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వరుసగా కోహ్లీ (180), రోహిత్ (185), రైనా (193) 3,4,5 స్థానాల్లో ఉన్నారు.