IND vs SL 2024: వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్లు.. సంజు శాంసన్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

IND vs SL 2024: వరుసగా రెండు మ్యాచ్ ల్లో డకౌట్లు.. సంజు శాంసన్ టీ20 కెరీర్ ముగిసినట్టేనా..?

టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా తయారైంది. అసలే జట్టులో చోటు దక్కడం కష్టమనుకుంటే వచ్చిన అవకాశాలను ఈ కేరళ బ్యాటర్ వినియోగించుకోలేకపోయాడు. శ్రీలంకతో వన్డే జట్టులో స్థానం కోల్పోయిన సంజు.. టీ20 ల్లో 15 మంది స్క్వాడ్ లో ఎంపికయ్యాడు. తొలి మ్యాచ్ లో శాంసన్ కు బదులు రియాన్ పరాగ్ కు తుది జట్టులో అవకాశం ఇవ్వడంతో విమర్శలు వచ్చాయి.

ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ కు మరోసారి అన్యాయం జరిగిందని నెటిజన్స్ అభిప్రాయపడ్డారు. గిల్ గాయపడడంతో రెండో టీ20 మ్యాచ్ లో ప్లేయింగ్ 11 లో అవకాశం దక్కించుకున్న ఈ 30 ఏళ్ళ బ్యాటర్.. తొలి బంతికే ఔటయ్యాడు. శ్రీలంక స్పిన్నర్ తీక్షణ వేసిన బంతిని అంచనా వేయలేక క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో మూడో టీ20ల్లో అతన్ని పక్కన పెడతారని భావించారంతా. అయితే సిరీస్ రావడంతో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి శాంసన్ కు మరో అవకాశమిచ్చారు.

ఈ మ్యాచ్ లోనూ డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. భారీ షాట్ కు ప్రయత్నించి చమిందు విక్రమసింఘే బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంజుపై నెటిజన్స్ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్ తో సంజు శాంసన్ టీ20 కెరీర్ ముగిసిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో ఐపీఎల్ ఆడినంత సింపుల్ కాదు ఇండియాకు ఆడదామంటే అని విమర్శిస్తున్నారు. మరికొందరేమో  సంజు హ్యాపీ రిటైర్మెంట్ డే అని పోస్టులు.. పెడుతుంటే వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాడు అని ఇంకొందరు అంటున్నారు. 

ఈ ప్రదర్శనతో సంజు శాంసన్ కెరీర్ దాదాపుగా ముగిసినట్టుగానే కనిపిస్తుంది. ఇప్పటికే శాంసన్ వయసు 30 ఏళ్ళు ఉండడం.. నిలకడ లేని ఆట తీరు.. విపరీతమైన కాంపిటీషన్ లాంటి అంశాలన్నీ శాంసన్ కు ప్రతికూలంగా మారాయి. 2026 టీ20 వరల్డ్ కప్ కు సంజు దూరమవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.