శని అంటే ఇదే కావొచ్చు..! ఓటమి నిరాశలో ఉన్న సంజు శాంసన్‎కు భారీ జరిమానా

శని అంటే ఇదే కావొచ్చు..! ఓటమి నిరాశలో ఉన్న సంజు శాంసన్‎కు భారీ జరిమానా

న్యూఢిల్లీ: గుజరాత్ టైటాన్స్‎తో జరిగిన మ్యాచులో ఓటమి పాలై నిరాశలో ఉన్న రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‎కు మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మ్యాచులో స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఆర్ఆర్ కెప్టెన్ సంజు శాంసన్‎కు బీసీసీఐ రూ.24 లక్షల జరిమానా విధించింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 కింద ఫైన్ వేసినట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‎కు ఇది రెండవ స్లో ఓవర్ రేటింగ్ ఫైన్. సంజు శాంసన్ గైర్హాజరీ సమయంలో రియాన్ పరాగ్ రాజస్థాన్ కెప్టెన్‎గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్‎తో జరిగిన మ్యాచులో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా రియాన్ పరాగ్‎కు బీసీసీఐ రూ.12 లక్షల జరిమానా విధించింది. ఇదే తరహా తప్పు రెండోసారి రిపీట్ కావడంతో ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. కెప్టెన్ సంజు శాంసన్‎కు రూ.24 లక్షల ఫైన్ వేసింది. అలాగే.. ఇంపాక్ట్ ప్లేయర్‎తో సహా ప్లేయింగ్ లెవన్ ఆటగాళ్లకు కూడా రూ.6 లక్షల చొప్పున లేదా వారి వ్యక్తిగత మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించింది.

దీంతో ఈ సీజన్‎లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా జరిమానా పడిన కెప్టెన్ల జాబితాలో శాంసన్ చేరాడు. శాంసన్ కంటే ముందు హార్దిక్ పాండ్యా (ముంబై ఇండియన్స్), రియాన్ పరాగ్ (రాజస్థాన్ రాయల్స్), రిషబ్ పంత్ (లక్నో సూపర్ జెయింట్స్), రజత్ పాటిదార్ (ఆర్సీబీ) ఈ సీజన్లో స్లో ఓవర్ రేటింగ్ కారణంగా జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్లు. ఇక, ఈ మ్యాచు విషయానికి వస్తే.. అతిథ్య గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సొంతగడ్డపై ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టిన జీటీ.. 58 రన్స్‌‌‌‌ తేడాతో రాజస్థాన్ రాయల్స్ ను  చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 

"ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు సామ్సన్ స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రాజస్థాన్‎కు సీజన్‌లో ఇది రెండవ నేరం. కాబట్టి ఆర్ఆర్ కెప్టెన్ శాంసన్‎కు కూ.24 లక్షల జరిమానా విధించబడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌తో సహా ప్లేయింగ్ XIలోని మిగిలిన ఆటగాళ్లకు రూ.6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది’ అని ఐపీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. 

ఐపీఎల్ స్లో ఓవర్ రేటింగ్ నిబంధనలు:

మొదటిసారి రూ.12 లక్షలు

జట్టు మొదటిసారి స్లో ఓవర్ రేట్ సమస్యను ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్ మాత్రమే రూ.12 లక్షల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇతర ఆటగాళ్ళకు జరిమానా విధించరు. 

రెండోసారి రూ.24 లక్షలు

ఒక సీజన్‌లో ఒక జట్టు రెండోసారి స్లో ఓవర్ రేట్ రిపీట్ చేస్తే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ. 24 లక్షలు మరియు ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 6 లక్షల చొప్పున జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 25%, ఏది తక్కువైతే అది విధిస్తారు.

మూడోసారి రూ.30 లక్షలు, నిషేధం

ఒక సీజన్‌లో జట్టు మూడోసారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొంటే, బౌలింగ్ జట్టు కెప్టెన్‌కు రూ.30 లక్షల జరిమానా సహా ఒక మ్యాచ్ నిషేధం విధిస్తారు. అదనంగా, జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు రూ. 12 లక్షల చొప్పున జరిమానా లేదా వారి మ్యాచ్ ఫీజులో 50%, ఏది తక్కువైతే అది విధిస్తారు.