IPL 2025: కీపింగ్‌కు క్లియరెన్స్: ఇకపై ఇంపాక్ట్ ప్లేయర్ కాదు..రాజస్థాన్ కెప్టెన్‌గా బరిలోకి

IPL 2025: కీపింగ్‌కు క్లియరెన్స్: ఇకపై ఇంపాక్ట్ ప్లేయర్ కాదు..రాజస్థాన్ కెప్టెన్‌గా బరిలోకి

రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ పూర్తి ఫిట్ నెస్ సాధించాడు. అతను ఫిట్‌గా ఉన్నాడని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు ఐపీఎల్ 2025 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడిన శాంసన్.. తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నాడు. చేతి వేలి గాయం కారణంగా తొలి మూడు మ్యాచ్ ల్లో శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్ గా మ్యాచ్ ఆడాడు. శాంసన్ స్థానంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేశాడు. ప్రస్తుతం అతను ఫిట్ గా ఉండడంతో జట్టును ముందుండి నడిపించడానికి సిద్ధమయ్యాడు. 

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో శాంసన్ గాయపడ్డాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ సందర్భంగా అతనికి గాయమైంది. ఇంగ్లీష్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్‌ప్రెస్ డెలివరీ శాంసన్ చూపుడు వేలికి బలంగా తగిలింది. దీంతో రక్తస్రావం కూడా జరిగింది. ఫిజియో చికిత్స పొందిన తర్వాత సంజు బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ ఆ తర్వాత ఓవర్లోనే బిగ్ షాట్ కు ప్రయతించి ఔటయ్యాడు. ఆ తర్వాత తన వేలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

Also Read:-టెస్ట్ కాదు అంతకుమించి: జిడ్డు బ్యాటింగ్‌తో విసిగించిన పాక్ స్టార్ ప్లేయర్స్

రాజస్థాన్ రాయల్స్ తమ తదుపరి మ్యాచ్ ను  ఏప్రిల్ 5న పంజాబ్ కింగ్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ కు సంజు శాంసన్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2025 లో మూడు మ్యాచ్ ల్లో ఒక విజయం సాధించి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దీంతో ఎలాగైనా ఆ జట్టు పుంజుకోవాలని తీవ్ర కసరత్తులు చేస్తుంది. ఇక శాంసన్ వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 66 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. ఆ ఆతర్వాత కోల్ కతా పై 20 పరుగులు.. చెన్నై సూపర్ కింగ్స్ పై 13 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.