IPL 2025: రాజస్థాన్ కష్టం ఎవరికీ రాకూడదు: వరుస ఓటములు..గాయంతో కెప్టెన్ ఔట్

IPL 2025: రాజస్థాన్ కష్టం ఎవరికీ రాకూడదు: వరుస ఓటములు..గాయంతో కెప్టెన్ ఔట్

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టుకు వరుస పరాజయాలు ఎదురవుతుంటే.. కెప్టెన్ సంజు శాంసన్ గాయంతో తదుపరి మ్యాచ్ కు దూరమయ్యాడు. గురువారం (ఏప్రిల్ 24) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ కు సంజు శాంసన్ దూరమవుతాడని రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం సోమవారం (ఏప్రిల్ 21) అధికారికంగా ధృవీకరించింది. దీంతో శాంసన్ లేకుండానే ఆర్సీబితో పోరుకు రాజస్థాన్ సిద్ధమవుతుంది. 

ప్రస్తుతం శాంసన్ ప్రక్కటెముకల గాయంతో బాధపడుతున్నాడు. ఈ కారణంగా బెంగళూరుకు శాంసన్ వెళ్లడం లేదు. ఈ రాజస్థాన్ కెప్టెన్  జైపూర్‌లోని జట్టు హోమ్ బేస్‌లోనే ఎంపిక చేసిన వైద్య సిబ్బందితో ఉంటాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో శాంసన్ బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత మళ్ళీ బ్యాటింగ్ కు రాలేదు. అయితే సూపర్ ఓవర్ ఆడేందుకు బరిలోకి దిగాడు. గాయం కారణంగా లక్నో సూపర్ జయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆడలేదు. శాంసన్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. అతని స్థానంలో వైభవ్ సూర్య వంశీ తుది జట్టులోకి వచ్చాడు. 

Also Read:-స్ట్రాటజీ అంటే ఇదే మరి: ప్లే ఆఫ్స్‌కు చేరకున్నా.. మాకు ఇంకో లక్ష్యం ఉంది

ఐపీఎల్ 2025 సీజన్ లో రాజస్థాన్ ఘోర ప్రదర్శన చేస్తుంది. ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్ లో రెండు మాత్రమే గెలిచి ఆరు ఓడిపోయింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇకపై ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. మిగిలిన ఆరు మ్యాచ్ లు గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేస్ లో ఉంటుంది. ఒకటి ఓడిపోయినా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇలాంటి సమయంలో వారి ప్రధాన బ్యాటర్ సంజు శాంసన్ దూరం కావడం పెద్ద మైనస్ గా మారింది.