Sanju Samson: శాంసన్ వేలికి గాయం.. కనిపించేది మళ్లీ ఐపీఎల్‌లోనే.!

Sanju Samson: శాంసన్ వేలికి గాయం.. కనిపించేది మళ్లీ ఐపీఎల్‌లోనే.!

ఓవైపు నిలకడలేని ఆట, మరో వైపు గాయాలు.. భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ కెరీర్‌ను ఏదో చేసేలానే ఉన్నాయి. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాక.. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తుంటే.. మనోడు గాయపడి వాటిని చేజార్చుకుంటున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20 గాయపడిన శాంసన్.. ఆరు వారాల పాటు ఆటకు దూరం కానున్నాడని సమాచారం. మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టేది.. ఐపీఎల్ నాటికే. 

ఆదివారం జరిగిన మ్యాచ్‌లో దాదాపు 150కి.మీ. వేగంతో జోఫ్రా ఆర్చర్ వేసిన ఓ బౌన్సర్.. శాంసన్‌ చూపుడు వేలికి గట్టిగా తగలింది. ఆ దెబ్బకు అతను నొప్పితో విలవిల్లాడాడు. నొప్పి భరిస్తూనే శాంసన్‌ తిరిగి బ్యాటింగ్ కొనసాగించాడు. అదే అతని గాయాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఔటైన అనంతరం గాయం తీవ్రత తెలుసుకునేందుకు స్కానింగ్ చేయించగా.. వేలు ఫ్రాక్చర్‌ అయినట్లు తేలింది. నివేదికల ప్రకారం, శాంసన్ పూర్తిగా కోలుకోవడానికి 4 నుంచి 6 వారాలు పట్టొచ్చని తెలుస్తోంది. 

ALSO READ | Champions Trophy 2025: దుబాయ్‌లో టీమిండియా మ్యాచ్‌లు.. టికెట్ ధర వెల్లడించిన ఐసీసీ

"శాంసన్ చూపుడు వేలికి ఫ్రాక్చర్ అయింది. అతను మళ్లీ బ్యాట్ పట్టేందుకు 4 నుంచి 6 వారాల సమయం పట్టొచ్చు. అందువల్ల, రంజీ ట్రోఫీ నాకౌట్లలో కేరళ తరుపున భారత వికెట్ కీపర్ బ్యాటర్ అందుబాటులో ఉండడు. నేరుగా ఐపీఎల్ నాటికి తిరిగి రావచ్చు.." అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

 ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌, ఛాంపియన్స్‌ ట్రోఫీకి శాంసన్‌ ఎంపిక కాలేదు. కావున, వచ్చిన నష్టమేమి లేదు. కాకపోతే, రంజీ ట్రోఫీ నాకౌట్లలో కేరళకు ఆడలేకపోవడం అతన్ని బాధించొచ్చు. ప్రస్తుతం శాంసన్ తిరువనంతపురంలోని తన ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్నిరోజులు గడిపాక.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చేరుకోనున్నాడు.