టీ20 వరల్డ్ కప్ లో శనివారం (జూన్ 22) బంగ్లాదేశ్ తో భారత్ మ్యాచ్ కు సిద్ధమైంది. సూపర్ 8 లో భాగంగా జరగనున్న ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. తొలి మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల తేడాతో గెలిచి టీమిండియా ఆత్మవిశ్వాసంతో ఉంటే.. బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాపై ఓడిపోయి ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. మరోవైపు బంగ్లా సెమీస్ రేస్ లో నిలవాలంటే తప్పనిసరిగా విజయం సాధించాలి. ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.
శాంసన్ కు అవకాశం:
ఈ మ్యాచ్ లో భారత్ తుది జట్టు విషయానికి వస్తే ఒక మార్పు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. వరుసగా విఫలమవుతున్న దూబే స్థానంలో సంజు శాంసన్ ప్లేయింగ్ 11 లోకి రావొచ్చు. దూబే బౌలింగ్ కూడా వేయడం లేదు కాబట్టి అతన్ని ఈ మ్యాచ్ లో బెంచ్ కు పరిమితం చేయవచ్చు. జట్టులో అక్షర్ పటేల్, జడేజా, కుల్దీప్ రూపంలో ముగ్గురు స్పిన్నర్లు.. బుమ్రా, అర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్య లతో నిండిన పేస్ బౌలింగ్ ఉంది. ఆరుగురు బౌలర్లతో నిండిన టీమిండియా.. దూబే అవసరం లేదనుకుంటే పక్కన పెట్టొచ్చు. మిడిల్ ఆర్డర్ లో శాంసన్ బ్యాటింగ్ చేయడం అతనికి కలిసి వచ్చే అంశం. ఈ ఒక్క మార్పు మినహాయిస్తే ఎలాంటి మార్పులు చోటు చేసుకోవచ్చు.
బలాబలాలు, ముఖాముఖీ రికార్డులు చూస్తే ఈ పోరులో ఇండియానే ఫేవరెట్. అయితే మెగా టోర్నీల్లో ఇండియా, బంగ్లా మధ్య గతంలో హోరాహోరీ పోరాటాలు సాగాయి. తమదైన రోజు బంగ్లా ఆటగాళ్లు అద్భుతాలు చేయగలరు. కాబట్టి ఆ టీమ్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయకుండా తమ పూర్తి సత్తాను చాటాలని రోహిత్‌సేన భావిస్తోంది. ఇప్పటికే ఆసీస్ చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్న బంగ్లాకు ఈ మ్యాచ్ చావోరేవో కానుంది.
భారత్ తుది జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా
బంగ్లాదేశ్ తుది జట్టు అంచనా:
తాంజిద్ హసన్, లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), తౌహిద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, రిషాద్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్