టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో టీమిండియా.. దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. సఫారీ జట్టు విజయానికి చివరి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయాన.. రోహిత్ సేన సమయస్ఫూర్తితో సమిష్టిగా పోరాడి ట్రోఫీ దక్కించుకుంది. అయితే, కెరీర్‌లో తొలిసారి ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న వికెట్ కీపర్/ బ్యాటర్ సంజు శాంసన్.. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్‌లోనూ ఆడ లేదు. అలా ఎందుకు జరిగింది..? వచ్చిన ఒక్క అవకాశం చివరి నిమిషంలో ఎలా చేజారింది..? అనే దానిపై అతను నోరు విప్పాడు.
దక్షిణాఫ్రికాతో ఫైనల్‌కు ముందు మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉండాలని భారత కెప్టెన్ నుంచి పిలుపొచ్చినట్లు తెలిపిన శాంసన్.. టాస్ వేయడానికి కొద్ది నిమిషాల ముందు అది చేజారిందని వెల్లడించాడు. ఫైనల్లో అదే జట్టును కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవడమే అందుకు కారణమని పేర్కొన్నాడు.
చివరి నిమిషంలో..
"నాకు ఫైనల్ మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చింది. ఆడేందుకు సిద్ధంగా ఉండమని రోహిత్ చెప్పారు. ఆ మాట వినగానే నేను చాలా సంతోష పడ్డా.. మ్యాచ్‌కు సిద్ధమయ్యా. అయితే, మరో 10 నిమిషాల్లో టాస్ వేస్తారు అన్న సమయంలో జట్టులో ఎలాంటి మార్పులు చేయడం లేదని రోహిత్ నన్ను పక్కకు తీసుకెళ్లి చెప్పి వెళ్లిపోయాడు. ఆ సమయంలో అలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరించాడు.. అర్థం చేసుకున్నావా? అని నన్ను అడిగాడు.."
ALSO READ | IND vs NZ: గిల్ రీ ఎంట్రీ కంఫర్మ్.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు: భారత అసిస్టెంట్ కోచ్
"ఆ మ్యాచ్ గెలవాలి.. ట్రోఫీని ముద్దాడాలి. ఆ సమయంలో అదే నా మదిలో మెదులుతోంది.. అందుకు సరేనన్న నేను.. 'ఫస్ట్ మ్యాచ్ గెలుద్దాం. ఆ తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్‌పై దృష్టి పెట్టండి..' అని రోహిత్‌తో చెప్పా. మరో 10 నిమిషాల తరువాత మళ్లీ నా దగ్గరకు వచ్చి.. 'నువ్వు నన్ను తిట్టుకుంటున్నావని నాకు తెలుసు, నువ్వు సంతోషంగా లేవని అనుకుంటున్నా..' అని అన్నాడు. 'ఒక ఆటగాడిగా నేను ఆడాలనుకుంటున్నానని అతనితో చెప్పాను.. అప్పుడు నా మనసులో అదే ఉంది..' నిజానికి అంత కీలకమైన మ్యాచ్‌కు ముందు జట్టు ప్రయోజనాలే ముఖ్యం. ఎదుటి ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన సమయం కెప్టెన్‌కు ఉండదు. కానీ, రోహిత్ నా విషయంలో చూపించిన చొరవ.. దగ్గరగా వచ్చి మాట్లాడటం నన్నెంతో కదిలించాయి. అతని కెప్టెన్సీలో ఆడలేకపోయాననే బాధ మాత్రం నాలో ఇప్పటికీ ఉంది.." అని శాంసన్ వివరించాడు.
కాగా, శాంసన్ ఇటీవల ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. 40 బంతుల్లోనే శతకం బాది.. ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.