జూన్ 1 నుంచి అమెరికా, వెస్టిండీస్ దేశాల వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు బీసీసీఐ మంగళవారం(ఏప్రిల్ 30) జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. బ్యాటర్లు, బౌలర్లు, అల్‌రౌండర్లలతో కూడిన 15 మంది సభ్యుల గల పటిష్ట జట్టును ఎంపిక చేసింది. ఈ టీమ్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహించనుండగా.. ఐపీఎల్ 2024లో అలరిస్తున్న యువ క్రికెటర్లు శివం దూబే, సంజూ శాంసన్ వంటి వారు చోటు దక్కించుకున్నారు. ప్రపంచ కప్ జట్టులో తనకు చోటు దక్కిన కొన్ని గంటల్లోనే సంజూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశాడు.
అలుపెరగని శ్రామికుడు
దేశవాళీ టోర్నీలలో, ఐపీఎల్‌లో రాణిస్తున్నా.. శాంసన్‌కు ఎక్కువ అవకాశాలు రాలేదన్నది అందరికీ తెలిసిన విషయంపై. దీనిపై అతని అభిమానులు ఎప్పటికప్పుడు సెలెక్టర్లను ప్రశ్నిస్తూనే వచ్చారు. అయినప్పటికీ.. సంజూ ఏనాడూ నిరాశ చెందలేదు. తనకు తాను సర్ధిచెప్పుకుంటూనే హార్డ్ వర్క్ కొనసాగిస్తూనే వచ్చాడు. మొత్తానికి అతని శ్రమను, ప్రతిభను గుర్తించిన సెలక్టర్లు ప్రపంచ జట్టులో చోటు కల్పించారు. జట్టు ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే సంజూ తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. "వియార్పు తునియిట్ట కుప్పయం (വിയർപ്പു തുന്നിയിട്ട കുപ്പായം)" అంటూ తన మాతృభాష మలయాళంలో పోస్ట్ చేశాడు. 'చెమట, శ్రమతో కుట్టిన చొక్కా(Shirt stitched of sweat and hard work)..' అని ఆ పోస్ట్ అర్థం. తాను భారత జెర్సీలో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఈ క్యాప్షన్ జోడించాడు.
కెప్టెన్‌గా/కీపర్‌గా/ బ్యాటర్‌గా.. అన్నింటా సక్సెస్
గత సీజన్ల గణాంకాలను పక్కనపెడితే.. ఈ ఏడాది మాత్రం ఐపీఎల్ సంజూ శాంసన్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. కెప్టెన్‌గా/కీపర్‌గా/ బ్యాటర్‌గా.. రాజస్థాన్ రాయల్స్ ను ముందుండి నడిపిస్తున్నాడు. అతని సారథ్యంలో రాయల్స్ ఇప్పటివరకూ 9 మ్యాచ్ ల్లో 8 విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అలాగే, అతను ఆడిన 9 మ్యాచ్ ల్లో 77 సగటుతో 385 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఎప్పుడో 2015లో తొలి అంతర్జాతీయ టీ20 ఆడిన సంజూ.. ఇప్పటివరకూ 25 టీ20లకు మాత్రమే పరిమితమయ్యాడు. వచ్చిన అవకాశాన్ని అతను ఎంతవరకూ ఉపయోగించుకుంటాడో వేచి చూడాలి.
టీ20 ప్రపంచ కప్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైశ్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్.
స్టాండ్ బై ప్లేయర్స్: శుభ్ మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేశ్ ఖాన్.
టీ20 ప్రపంచ కప్ 2024 టీమిండియా షెడ్యూల్
- జూన్ 05న: ఇండియా vs ఐర్లాండ్ (న్యూయార్క్)
- జూన్ 09న: ఇండియా vs పాకిస్థాన్ (న్యూయార్క్)
- జూన్ 12న: ఇండియా vs అమెరికా (న్యూయార్క్)
- జూన్ 15న: ఇండియా vs కెనడా (ఫ్లోరిడా)