Sanju Samson: నాకూ టెస్టు క్రికెట్ ఆడాలనుంది.. అవకాశం ఇవ్వండి: సంజూశాంసన్

Sanju Samson: నాకూ టెస్టు క్రికెట్ ఆడాలనుంది.. అవకాశం ఇవ్వండి: సంజూశాంసన్

ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడనే విమర్శలకు భారత క్రికెటర్ సంజూ శాంసన్ చెక్ పెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఉప్పల్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన ఆఖరి టీ20లో ఈ భారత వికెట్ కీపర్ చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లోనే శతకం బాది టీ20ల్లో భారత్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ ఒక్క ప్రదర్శనతో మరో పది మ్యాచ్‌ల్లో తన స్థానానికి డోకా లేదని నిరూపించాడు. అంతేకాదు, ఈ మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో అతనితో కొత్త ఆశలూ చిగురించాయి. 

తాను భారత్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పాటు టెస్టు క్రికెట్ ఆడాలనుకుంటున్నట్లు శాంసన్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపాడు. అందుకు వారు సిద్ధంగా ఉండాలని సూచించినప్పటికీ, కొన్ని షరతులు విధించినట్లు వెల్లడించాడు. మరిన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాలని సూచించినట్లు పేర్కొన్నాడు.

Also Read :- చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ హెలికాఫ్టర్ పొలాల్లో దిగింది..!

"నేను టెస్టుల్లోనూ రాణించగలననే నమ్మకం ఉంది. కేవలం వైట్-బాల్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం కావాలని కోరుకోవడం లేదు. భారత జట్టు తరఫున టెస్టు క్రికెట్‌ ఆడాలనేది నా కోరిక. ఈ మధ్య జరిగిన దులీప్‌ ట్రోఫీకి ముందే మేనేజ్‌మెంట్ నుంచి నాకు ఈ విషయం తెలిసింది. నన్ను రెడ్ బాల్ క్రికెట్ కోసం పరిగణిస్తున్నారని, దానిని సీరియస్‌గా తీసుకోవాలని, మరిన్ని రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఆడాలని సూచించారు.." అని శాంసన్ వెల్లడించాడు.  

ఆసీస్ పర్యటన.. మంచి అవకాశం

ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో శాంసన్‌కు చోటు దక్కలేదు. వచ్చే నెలలో బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకువెళ్లనుంది. ఈ టూర్‌కు ముందు సంజూ  రెండు మంచి ఇన్నింగ్స్‌లు ఆడితే.. సెలెక్టర్ల నుంచి పిలుపు అందుకోవచ్చు.