- మెహందీ ఫంక్షన్లో ఘటన
- 2 కిలోల గోల్డ్, 8 కిలోల వెండి, రూ.2.50 లక్షల క్యాష్ మాయం
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ పార్శి రాధా బాలకృష్ణ ఇంట్లో భారీ చోరీ జరిగింది. దాదాపు 2 కిలోలకు పైగా గోల్డ్, 8 కిలోల వెండి, రూ.2.50లక్షల నగదు కనిపించకుండా పోయాయి. ఈ నెల 20న రాధా బాలకృష్ణ కూతురి పెండ్లి ఉంది. అందుకోసం పెద్ద ఎత్తున బంగారం తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి మెహందీ ఫంక్షన్ నిర్వహించారు. అదే అదునుగా దుండగులు బంగారం, వెండి, క్యాష్ ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి తర్వాత గుర్తించిన బాధితులు శంకర్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నార్సింగి ఏసీపీ రమణగౌడ్, సీఐలు శ్రీనివాస్ గౌడ్, హరి ప్రసాద్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తెలిసిన వారి పనేనని అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.