
- రాజ్యమేలుతున్న నకిలీ డాక్టర్లు
- మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో పలువురి గుట్టురట్టు
- హాస్పిటల్ మేనేజ్మెంట్ చదివి..
- తుర్కయాంజాల్‌లో వెలుగులోకి..
- కమ్మగూడలో ఏఎన్ఎం చదివి వైద్యం చేస్తున్న మహిళ
- బ్రాహ్మణపల్లిలో టెన్త్ పాసై అల్లోపతి ట్రీట్మెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ మెడికల్ కౌన్సిల్(టీఎంసీ) అధికారుల దాడుల్లో నకిలీ డాక్టర్ల బండారం బయటపడుతోంది. కొద్ది రోజులుగా గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో టీఎంసీ విస్తృత తనిఖీ చేస్తోంది. గత శుక్రవారం బాచుపల్లిలో టెన్త్క్లాస్కూడా పాస్‌కాకుండా ఓ మహిళ ప్రిస్కిప్షన్‌పై డాక్టర్అని రాసుకుని అబార్షన్లు చేస్తూ దొరికిపోయింది. ఈ ఘటన మరువక ముందే ఆదివారం మరికొంతమంది నకిలీ డాక్టర్లు చిక్కారు.
రంగారెడ్డి జిల్లాలోని తుర్కయాంజాల్‌లోని రాజర్షి ఇన్ఫర్మిటీలో టీఎంసీ ఆఫీసర్లు డా.వి.నరేశ్‌కుమార్, డా.కడాలి విష్ణు టీమ్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంబీఏ హాస్పిటల్మేనేజ్మెంట్చదివి డాక్టర్ గా ట్రీట్మెంట్చేస్తున్న చంద్రశేఖర్‌ను పట్టుకున్నారు.
క్వాలిఫైడ్ డాక్టర్లేకుండా ఇతడే పేషంట్లకు ఇష్టానుసారం యాంటీ బయాటిక్స్ రాస్తూ, స్టెరాయిడ్స్, ఇంజెక్షన్స్ ఇస్తూ ఐవీ ఫ్లూయడ్స్పెడుతున్నట్టు గుర్తించారు. పైగా 2023లో రాజర్షి ఇన్ఫర్మిటీని బ్రోకర్ ద్వారా ఈఎన్టీ డాక్టర్ కాత్యాయని పేరుపై అనుమతి తీసుకున్నట్టు తెలిసింది.
డాక్టర్ కాత్యాయని వారానికి ఒకసారి వచ్చి వెళ్తారని అధికారులకు చెప్పాడు. అధికారులు డాక్టర్ కాత్యాయనికి ఫోన్‌చేయగా, సదరు నిర్వాహకుడు ఎవరో, సెంటర్ ఎక్కడో తనకు తెలియదని చెప్పారు. దీనిపై డాక్టర్కాత్యాయనికి నోటీసు ఇవ్వనున్నట్లు టీజీఎంసీ సభ్యులు డాక్టర్ కడాలి విష్ణు తెలియజేశారు.
మరో ఇద్దరిపై కేసు..
కమ్మగూడలో ఏఎన్ఎం చదివి స్మార్ట్ క్యూర్ క్లినిక్ నిర్వహిస్తున్న చంద్రమ్మ/చంద్రకళను, బ్రాహ్మణపల్లి ఎక్స్ రోడ్లో పదో తరగతి చదివి వాసు మెడికల్ స్టోర్ నిర్వహిస్తూ అల్లోపతి వైద్యం చేస్తున్న సీహెచ్ శ్రీనివాస్ పై ఎన్ఎమ్సీ 34,54 ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 400 మందిపై కేసులు నమోదు చేశామని, నగరంలోనే సుమారు 150 కేసులు పెట్టామని చెప్పారు.