సూర్యాపేట, వెలుగు: తనను గెలిపిస్తే సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే లైన్ తీసుకొస్తానని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్ రావు హామీ ఇచ్చారు. సోమవారం పెన్ పహాడ్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తేనే మంత్రి జగదీశ్ రెడ్డికి పేదలు, సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, గృహాలక్ష్మీ, దళితబంధు, బీసీ బంధు పథకాలు బీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని ఆరోపించారు. గ్రామాల్లో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. సంక్షేమ పథకాల పేరుతో మరోమారు మోసం చేయాలని చూస్తున్నారని, వారికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అనంతరం ఆత్మకూరు(ఎస్) వైస్ ఎంపీపీ నేరెళ్ల కేతమ్మ వెంకన్న, కందగట్ల గ్రామ వార్డు మెంబర్ గోగుల మధు, బీఆర్‌ఎస్ గ్రామ ప్రధాన కార్యదర్శి సకినాల వెంకన్న బీజేపీలో చేరారు.