సూర్యాపేటకు రైల్వే లైన్ తీసుకొస్తా : సంకినేని వెంకటేశ్వర్‌రావు

  • పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తా 
  • ఉమ్మడి జిల్లాలోని బీజేపీ అభ్యర్థులకు అవకాశం  ఇవ్వండి
  • సూర్యాపేట అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు 

సూర్యాపేట, వెలుగు : ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సూర్యాపేట  ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేలైన్‌ తీసుకొస్తానని  నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వర్‌రావు హామీ ఇచ్చారు. శుక్రవారం పేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి అధ్యక్షతన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్‌ రెడ్డి చీఫ్‌ గెస్టులుగా నిర్వహించిన జనగర్జన సభలో ఆయన మాట్లాడారు. అవినీతిరహిత పాలన కోసం బీజేపీ అభ్యర్ధులకు ఓటువేసి గెలిపించాలని కోరారు.  తొమ్మిదిన్నరేండ్ల బీఆర్‌ఎస్‌ నేతలు జిల్లాలోని సహజ వనరులను విచ్చలవిడిగా దోచుకున్నారని ఆరోపించారు.  ప్రాజెక్టుల నిర్మాణం పేరిట మూసీ నదిలోని ఇసుకను  అక్రమంగా తరలించి వేలకోట్లు సంపాదించారని విమర్శించారు.

ప్రభుత్వ భూములను కబ్జాలు చేయడంతో పాటు, కలెక్టరేట్‌నిర్మాణం పేరుతో పేదల నుంచి వందల ఎకరాల భూమిని తక్కువ ధరకు అప్పనంగా లాక్కున్నారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చాయని డబుల్‌ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తికాకుండానే డ్రా తీసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఈ సారి తనకు అవకాశం ఇస్తే తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధిని మించి పనులు చేస్తానని స్పష్టం చేశారు.  ప్రభుత్వ నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా పేదలకు ఇండ్లు నిర్మించి ఇస్తానని, రోడ్లను బాగు చేస్తానని హామీ ఇచ్చారు. 

హైవే ఆరు లేన్లుగా విస్తరణ

సూర్యాపేట మీదుగా వెళ్లే హైదరాబాద్‌-–విజయవాడ హైవేను కేంద్రం ఆరు లేన్లు విస్తరిస్తోందని, ఇప్పటికే కొన్నిచోట్ల పనులు మొదలయ్యాయని చెప్పారు. ఈ పనులు స్పీడప్‌ చేయడంతో పాటు  జాతీయ రహదారిపై సూర్యాపేటలో అండర్‌పాస్‌ల నిర్మాణం చేపడుతామన్నారు.  బీఆర్‌ఎస్‌ పాలనలో యువతకు ఉపాధి అవకాశాలు లేక కూలీ పనులకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు చేసి.. యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. సూర్యాపేటతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి..

సేవ చేసే అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర స్కిల్‌ డెవలప్‌ మెంట్, ఐటీ సహాయ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి  రాజీవ్‌చంద్రశేఖర్, తుంగతుర్తి  అభ్యర్థి కడియం రామచంద్రయ్య, నాగార్జున్‌సాగర్‌ అభ్యర్థి కంకణాల నివేదితారెడ్డి, భువనగిరి అభ్యర్థి గుడూరు నారాయణరెడ్డి, మహబూబాబాద్‌ అభ్యర్థి హుస్సేన్‌నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, సీనియర్‌నాయకులు గొంగిడి మనోహర్‌రెడ్డి, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాష్ట్ర నాయకుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, పోరెడ్డి కిశోర్‌రెడ్డి, రుక్మారావు తదితరులు పాల్గొన్నారు.