
ఏపీలోని పలు జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. ఇళ్ల ముందు మహిళలు రంగవల్లులతో సందడి చేస్తుంటే పందెం రాయుళ్లు పుంజులను కోడి పందేలా కోసం సిద్ధం చేస్తున్నారు. మంచి పుంజుల కొనేందుకు జల్లెడపడుతూ, బేరసారాలు చేస్తున్నారు. రంగు, రూపు, జాతి చూసి కొనుగోలు చేస్తున్నారు. రంగును బట్టి రకం అంటూ అధిక రేటైనా వెనకాడకుండా పుంజులను కొంటున్నారు. సంక్రాంతి సీజన్ లో కోళ్లకు మంచి గిరాకీ ఉంటుంది. కోళ్ల పెంపకం దారులకు మంచి ఆదాయం వస్తుంది. రంగు, బ్రీడ్ ను బట్టి ఒక్కో పుంజు ఒక్కో ధర పలుకుతుంది. కాకి, డేగ, సీతువా, పింగళా, పచ్చ కాకి వంటి జాతులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు పందెం రాయుళ్లు. దాదాపు కోళ్లలో 50 రకాలు ఉన్నాయి. ఒక్కో పుంజు ధర మినిమం 5 వేల రూపాయిలు ఉంటుంది. అయితే ఈ సీజన్ లో జాతి కోళ్ల ధర దాదాపు 20 వేల రూపాయిల నుంచి లక్షల్లో ధరలు పలుకుతాయి. పుంజు నచ్చితే చాలు... ధర గురించి ఆలోచించకుండా పందెం రాయుళ్లు కొనుగోలు చేస్తారు. కాకి, డేగ, నెమలి రకం కోడి పుంజులను ఎక్కువగా పందేలకు సిద్ధం చేస్తారు.
కోడి పందేల కోసం పుంజులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. పుష్ఠికరమైన ఆహారం పెడుతూ పందేనికి సిద్ధం చేస్తున్నారు. కీమా, కోడిగుడ్లు, జీడిపప్పు, బాదం, పిస్తా వంటి ఆహారాన్ని పుంజులకు అందిస్తున్నారు. ఇతర కోళ్లతో కలవనీయకుండా తోటల్లో పుంజులను ప్రత్యేకంగా పెంచుతున్నారు. పుంజులకు కొవ్వు పట్టకుండా, పోటీల్లో తలపడేందుకు పసుపు, వేప ఆకులు వేసిన గోరువెచ్చటి నీటిలో స్నానం చేయిస్తున్నారు. స్విమ్మింగ్, ఇతర వ్యాయామాలు కూడా చేయిస్తున్నారు. అయితే పోటీలకు వారం ముందు మాత్రం తేలికపాటి ఆహారం పెట్టనున్నట్లు చెబుతున్నారు పందెం రాయుళ్లు.
ఏపీలోని కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతాయి. ఏపీలోని ఇతర ప్రాంతాల నుంచే కాకుండా హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కోడి పందేలు చూసేందుకు జనం భారీగా తరలి వస్తారు. లక్షల్లో పందాలు కాస్తారు. సంక్రాంతి మూడు రోజుల్లో కోడి పందేలతో వందల కోట్లు చేతులు మారతాయి. కొన్ని ప్రాంతాల్లో పర్మిషన్ తీసుకొని కోడి పందేలు నిర్వహిస్తారు. అయితే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం సిక్రెట్ గా పోటీలు నిర్వహిస్తారు. ఎక్కడికక్కడ పోలీసులు దాడులు చేసి పందెం రాయుళ్లను అరెస్ట్ చేస్తున్నప్పటికి వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తరతరాలుగా కోడి పందేలు నిర్వహిస్తున్నామని, తమ సాంప్రదాయ క్రీడ అని పందెం రాయుళ్లు చెబుతున్నారు.