సంక్రాంతి పండుగ ఒక్కోచోట ఒక్కోలా

ఇంటి ముందు రంగుల ముగ్గులు, వంటింట్లో పిండి వంటలు, తెల్లారి భోగిమంటలు, పొద్దున్నే పూజలు ఇవన్నీ ఉన్నాయంటే అదే సంక్రాంతి పండుగ. పండుగనాడు చాలామంది స్వీట్లు, గిఫ్ట్​లు, బట్టలు వంటివి ఇచ్చిపుచ్చుకుంటారు. మనదేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉన్న మనవాళ్లంతా పండుగ చేసుకుంటారు. అయితే మనదేశంలో జరుపుకునే ఈ పండుగకు రాష్ట్రానికో పేరు, సెలబ్రేషన్​కో తీరూ ఉన్నాయి. అవేంటంటే... 

సంక్రాంతి పండుగను తమిళనాడులో తాయ్ పొంగల్ లేదా ఉజావర్ తిరునాళ్​, పశ్చిమ బెంగాల్​, బంగ్లాదేశ్​లో పౌశ్ సంక్రాంతి, అస్సాంలో మాఘ్​ బిహు, పంజాబ్​లో మాఘీ, కర్నాటకలో సుగ్గీ హబ్బ, ఉత్తరాఖండ్​లో గుగుటి, ఒడిశాలో మకర మేళా లేదా మకర చౌళ, కేరళలో మకర విలక్కు, త్రిపురలో హంగ్రై, కాశ్మీర్ వ్యాలీలో శిశుర్ సేంక్రాత్, మిథిలలో తిలా సక్రెయిత్ అంటారు. 
కిచ్దీ: ఉత్తరప్రదేశ్​లో సంక్రాంతిని కిచ్దీ లేదా ‘ఫెస్టివల్ ఆఫ్​ డొనేషన్’​ అంటారు. అలహాబాద్​లో ఉన్న గంగా, యమున, సరస్వతీ నదులు కలిసే చోట మాఘ జాతర చేస్తారు. ఇది సంక్రాంతి నుంచి నెల రోజుల పాటు జరుగుతుంది. సంక్రాంతి రోజున ఉపవాసం ఉంటారు. ఉపవాసం అయిపోయాక కిచ్దీ తింటారు. ఈ సందర్భంగా గోరఖ్​పూర్​లో కిచ్దీ మేళా కూడా జరుగుతుంది. 
ఉత్తరాయణ్​: గుజరాత్​లో ‘ఉత్తరాయణ్​’​ అంటారు. గుజరాత్​లో ప్రతి ఏడాది రెండొందల పండుగలు జరుగుతాయి. వాటిలో పెద్ద పండుగ ఉత్తరాయణ్. పండుగనాడు తల్లిదండ్రులు కూతుళ్లకు స్వీట్లు పంపుతారు. అంతేకాకుండా ఈరోజు పెద్ద ఎత్తున గాలిపటాలు ఎగరేస్తారు. అందుకోసం కొన్ని నెలల ముందునుంచే వాటిని తయారుచేయడం మొదలుపెడతారు. 
మాఘే సంక్రాంతి: పొరుగునున్న నేపాల్​లో సంక్రాంతిని పిలిచే పేరిది. ఈ రోజు తారు ప్రజలకు స్పెషల్. మగర్ కమ్యూనిటీకి ఇది సంవత్సరాది పండుగగా అక్కడి గవర్నమెంట్ ప్రకటించింది. లడ్డూలు, నెయ్యి, చిలగడ దుంపల(గెన్సుగడ్డ, మొరం గడ్డ)ను పంచుకుంటారు. 
లోహ్రి: మకర సంక్రాంతిని హర్యానా, పంజాబ్​ రాష్ట్రాల్లో లోహ్రీ అని పిలుస్తారు. రాత్రుళ్లు అందరూ ఒక చోట చేరి భోగిమంట వేస్తారు. ఆ చలి రాత్రిలో భగభగమంటూ భోగిమంట ఎగిసిపడుతుంటే, ఆ మంటలో మరమరాలు (బొంగులు), నువ్వులు, పాప్ కార్న్​లు వేస్తుంటారు. సంతోషం, సమృద్ధి కలగాలని కోరుతూ భోగిమంటకు పూజ చేస్తారు. 
తిర్మూరి: బీహార్​లో పండుగనాడు మినప్పప్పు, బియ్యం, బంగారం, ఉలెన్ బట్టలు, దుప్పట్లు వంటివి డొనేట్ చేస్తారు. మహారాష్ట్రలో పెళ్లైన ఆడవాళ్లంతా పత్తి, నూనె, ఉప్పు ఇచ్చిపుచ్చుకుంటారు. పాకిస్తాన్​లో కూడా సంక్రాంతి పండుగ చేసుకుంటారు. అక్కడ తిర్మూరి అని పిలుస్తారు. సింధీ ప్రజలు మాత్రమే ఈ పండుగ చేస్తారు. 

సంక్రాంతి స్పెషల్స్
ఈ పండుగనాడు స్పెషల్ అంటూ బోలెడు రకాలు మార్కెట్​లో కనిపిస్తున్నాయి. వాటిలో గిఫ్ట్స్​, యాక్సెసరీలు, కాఫీ కప్​, బ్యాడ్జ్​, దిండు, చాక్లెట్లతోపాటు పసుపు, కుంకుమలు ఉండే గిఫ్ట్ బాక్స్​లు కొన్ని. ముగ్గులు వేయడం రాని వాళ్లు లేదా వెరైటీగా ఇంటిని అలంకరించుకోవాలి అనుకునేవాళ్ల కోసం ఫ్యాబ్రిక్ రంగోలి మ్యాట్​లు ఉన్నాయి. ఇలా మరెన్నో సంక్రాంతి స్పెషల్ ఐటమ్స్​ ఆన్​లైన్​లో దొరుకుతున్నాయి.