గంటకు అక్షరాల వెయ్యి కార్లు: రికార్డ్ బద్దలు కొడుతున్న హైదరాబాద్, విజయవాడ హైవే

గంటకు అక్షరాల వెయ్యి కార్లు: రికార్డ్ బద్దలు కొడుతున్న హైదరాబాద్, విజయవాడ హైవే

హైదరాబాద్.. విజయవాడ జాతీయ రహదారి రికార్డులు బద్దలు కొడుతుంది. గంటకు వెయ్యి వాహనాలు వెళుతున్నాయి. ఇది అసాధారంగానే చెప్పొచ్చు.. ఎందుకంటే రెగ్యులర్ రోజుల్లో గంటకు 150 నుంచి 200 వాహనాలు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అందుకు ఎనిమిది రెట్లు పెరిగాయి. గతంలో ఏ సంక్రాంతి పండక్కి కూడా ఇంత రద్దీ లేదు అనేది టోల్ గేట్ల దగ్గర పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది.

సంక్రాంతికి వెళ్లే వాహనాలతో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే రూట్ కిక్కిరిసిపోయింది. నాలుగు సెకండ్లకు ఒక వెహికల్ టోల్ బూత్ ను క్రాస్ చేసి వెళుతున్నట్లు అంచనా. గంటకు 900 వాహనాలకు పైగా హైవేపై వెళుతున్నాయి.  చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. హైద్రాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి.

అటు ఐటీ వాళ్లకు.. ఇటు స్కూల్స్కు.. మరో వైపు ప్రైవేట్ ఉద్యోగులు అందరికీ ఒకేసారి సెలవులు మొదలయ్యాయి. నెలలో వచ్చే రెండో శనివారానికి తోడు ఆదివారం.. అందరికీ ఐదు రోజులు వరసగా సెలవులు రావటంతో సిటీలోని అందరూ ఒకేసారి బయలుదేరారు. దీంతో ట్రాఫిక్ ఒక్కసారిగా.. విపరీతంగా పెరిగిపోయింది. విజయవాడ హైవేపై టోల్ గేట్ల దగ్గర డేటా చూస్తే.. గంటకు వెయ్యి వాహనాలు.. అవి కార్లు, బస్సులు ఏమైనా కానీ.. గంటకు వెయ్యి వాహనాలు క్రాస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంటే ఏ రేంజ్ లో ట్రాఫిక్ ఉందో స్పష్టం అవుతుంది.

సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు హైదరాబాద్ నగరం నుంచి సొంతూళ్లకు లక్షల సంఖ్యలో బయల్దేరి వెళుతుంటారు. బస్సులు, రైళ్లు, కార్లు.. ఇలా ఎవరికి తగ్గట్టుగా వాళ్లు సొంతూరి బాటపడుతున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లు రద్దీగా మారాయి. ఆంధ్రాతో పాటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్లే బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. సంక్రాంతి పండుగ కోసం తెలంగాణ ఆర్టీసీ 6432  బస్సుల ను ప్రకటించింది.

ఏపీకి వెళ్లే బస్సుల్లో విపరీతమైన రద్దీ నెలకొంది. జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ వద్ద ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. ఎంజీబీఎస్ నుంచి ప్రతి రోజు 2200 బస్సులు నడుస్తాయి. వాటికి అదనంగా మరో 350 బస్సులను ఆర్టీసీ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఈరోజు(జనవరి 11, 2025), రేపు (జనవరి 12, 2025) పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయల్దేరే ప్రయాణికులతో హైదరాబాద్ నగరంలో రద్దీ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది.