తెలంగాణ - ఏపీ బార్డర్‌ గ్రామాల్లో జోరుగా కోడిపందేలు

భద్రాద్రికొత్తగూడెం/అశ్వారావుపేట, వెలుగు :  తెలంగాణ - ఏపీ బార్డర్‌ గ్రామాల్లో సోమవారం నుంచి నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున కోళ్ల పందేలు జరగనున్నాయి.  భద్రాద్రి జిల్లా నుంచి ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్తున్నారు. మరో వైపు కామయ్యపాలెంలో సోమవారం నిర్వహించిన కోడి పందేలను అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. జిల్లాలోని కొత్తగూడెం, చుంచుపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, చండ్రుగొండ ప్రాంతాల్లో పందేల నిర్వహణకు సిద్ధమవుతున్నారు.

ఏపీలోని తిరువూరు, నందిగామ, కంకిపాడు పరిసర ప్రాంతాల్లో కోడి పందేలు జరుగుతుండడంతో కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపహడ్, అశ్వారావుపేట, దమ్మపేట,ముల్కలపల్లి, చండ్రుగొండ, సుజాతనగర్​, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల తెలంగాణ--ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో జరిగే కోడి పందాలను చూసేందుకు భారీగా తరలి వెళ్తున్నారు. రూ. వేల నుంచి రూ. లక్షల్లో పందాలు కాస్తారు.  జిల్లాలో ఇప్పటికే పలు చోట్ల కోళ్ల పందాలు ఆడుతున్న వారిపై గత వారం రోజులుగా పోలీస్​లు కేసులు నమోదు చేస్తున్నా పందాలు మాత్రం ఆగడం లేదు.   

కోడి పందాల స్ధావరాలు పసిగట్టేందుకు డ్రోన్లు   : ఎస్పీ రోహిత్ రాజు 

కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  ఎస్పీ రోహిత్ రాజు  హెచ్చరించారు.సంక్రాంతి పండుగ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో కోడి పందాలను నివారించేందుకు జిల్లా పోలీసులు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  జిల్లా సరిహద్దుల్లో టాస్క్ ఫోర్స్ , స్థానిక పోలీస్ బృందాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాల తో నిఘ పెడుతున్నామన్నారు.. సరిహద్దుల్లో బైక్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు .