- ఊరు మునిగినా ఆనవాయితీ కొనసాగింది
- నీళ్లలోనే గుడి చుట్టూ ఎండ్ల బండ్ల ఊరేగింపు
పెబ్బేరు, వెలుగు: శ్రీరంగాపూర్ రంగసముద్రం రిజర్వాయర్కింద మునిగిన ఊరిలో సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం నాగరాల జనాలు. గ్రామంలోని గుడి ఆరు ఫీట్ల లోతు నీళ్లల్లో ఉండగా ఎడ్ల బండ్లపై వెళ్లి టెంపుల్చుట్టూ తిప్పి మొక్కులు సమర్పించుకున్నారు. రిజర్వాయర్ కట్టకముందు సంక్రాంతి రోజు వేణుగోపాల స్వామి ఆలయం చుట్టు ఎడ్ల బండ్లతో ప్రదక్షిణ చేసి పంటను నైవేద్యంగా సమర్పించేవారు. ప్రాజెక్టు వచ్చాక ఇండ్లు, పొలాలు, బళ్లు, గుడులు మునిగిపోయాయి. అయినా ఆనవాయితీని వదల్లేదు. 2020 లో మొదలుపెట్టి కొనసాగిస్తూనే ఉన్నారు. గ్రామంలోని 30 శాతం జనాభా శివారులో ఉంటున్నా , మిగతా 70 శాతం మంది చుట్టుపక్కల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలిపోయారు. అయినా ప్రతి సంక్రాంతికి అంతా కలిసివచ్చి ఎడ్ల బండ్లపై మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోతారు.