
సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరుట అని అర్థం. సంక్రాంతిని జయసింహ కల్పద్రుమం అనే గ్రంథంలో ఇలా నిర్వచించారు..- తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరతః సూర్యస్య పూర్వస్మాద్రాశే ఉత్తరః రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతిః. - మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుంచి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. వీటిలో మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. మార్గశిరం పూర్తికాగానే ఉత్తరాయణం మొదలవుతుంది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవేకాక ఈ కాలంలో చేసే గోదానం వలన స్వర్గవాసం కలుగుతుందని విశ్వసిస్తారు.
మొదటి రోజు భోగి మంటలు
భోగి రోజున ఉదయం తెల్లవారకముందే అంటే 3:30 నుంచి 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారదోలటానికే కాకుండా ఇంకో సందర్భంగా కూడా జరుపుకుంటారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లు, తట్టాబుట్టలు, విరిగిపోయిన బల్లలు వగైరాలను వదిలేసి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించటానికి గుర్తుగా కూడా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు. సాయంత్రం పూట చాలా ఇళ్లలో స్త్రీలు, చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు.
రెండో రోజు సంక్రాంతి
దాదాపుగా అందరి ఇళ్లలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు, సేమియా పాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు. సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దుల నృత్యం. గంగిరెద్దులవారు చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విన్యాసాలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దులవాళ్లు సందడి చేస్తారు. కొత్త ధాన్యం వచ్చిన సంతోషంతో మనం వారికి ధాన్యం ఇస్తాం. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ, తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు.
ముచ్చటగా మూడో రోజు కనుమ
మూడోరోజు అయిన కనుమను.. వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువు
లకు శుభాకాంక్షలు తెలపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడిపందాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఆ పందాలను జీవహింసగా భావించి రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. అంతేకాదు, వనభోజనాలను కూడా ఈరోజే నిర్వహిస్తుంటారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటి రోజును ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు. దక్షిణ భారతదేశంలోని ప్రజలు ఈ పండుగ మూడు రోజులను శ్రద్ధాసక్తులతో జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈ పండుగలోని రెండవ రోజయిన మకర సంక్రాంతి లేదా లోరీని మాత్రమే జరుపుకుంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం ఓ ఆనవాయితీ. మాంసాహారులుకాని వారు గారెలతో సంతృప్తి పడతారు.
- యాడవరం చంద్రకాంత్ గౌడ్