పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన

హైదరాబాద్: సంక్రాంతికి పంతంగి టోల్ ప్లాజా మీదుగా సొంతూళ్లకు వెళ్లే పబ్లిక్కు, మరీ ముఖ్యంగా వాహనదారులకు చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి కీలక సూచన చేశారు. పంతంగి టోల్ ప్లాజా దగ్గర వచ్చిన వాహనాలను వచ్చినట్టే పంపిస్తున్నామని, వాహనాదారులు నెమ్మదిగా వెళ్లాలని ఆయన సూచించారు. చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డితో వీ6 నిర్వహించిన ఫేస్ టూ ఫేస్లో ఆయన కీలక విషయాలను వెల్లడించారు. సాయంత్రం అయింది కాబట్టి ఇంకా వాహనాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఉదయం అబ్దుల్లాపూర్మెట్ దగ్గర రోడ్డు మరమ్మత్తు కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడిందని ఆయన చెప్పారు.

రాచకొండ కమిషనరేట్లోని ట్రాఫిక్ పోలీసులు, పోలీసుల సహకారంతో వాహనాలను క్లియర్ చేస్తున్నారని తెలిపారు. తిరుగు ప్రయాణంలో కూడా వాహనాల సంఖ్య ఇలానే ఉంటుందని, రాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని, రాత్రి సమయంలో ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్లాలని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి సూచించారు. ఇదిలా ఉండగా.. అబ్దుల్లాపూర్మెంట్ నుంచి చౌటుప్పల్, పంతంగి  టోల్ గేట్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు జామ్ అయిపోయి నెమ్మదిగా కదులుతున్నాయి.

Also Read :- హైదరాబాద్ సిటీ నుంచి లక్ష వాహనాలు ఔట్

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే రహదారిపై ఫుల్ ట్రాఫిక్ జామ్తో అవుతుండటంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్, అంబర్ పేట్, ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల్లో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి కావడంతో హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు భారీగా వాహనాలు వెళుతున్నాయి.