వెలుగు, సిటీ నెట్వర్క్: సంక్రాంతికి జనం పల్లెటూర్ల బాట పట్టడంతో శనివారం సిటీలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్టాపులు కిటకిటలాడాయి. ఎంజీబీఎస్, జేబీఎస్, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసి కనిపించాయి. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి దాకా మియాపూర్, కేపీహెచ్‌బీకాలనీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, లక్డీకాపూల్, ఎల్బీనగర్ బస్టాపుల వద్ద బస్సులు బారులు తీరాయి. ట్రాఫిక్ కారణంగా బస్సులు గంట నుంచి 4 గంటల ఆలస్యంతో స్టాపులకు చేరుకున్నాయి.
శుక్ర, శనివారాల్లో కేవలం కూకట్పల్లి ప్రాంతం నుంచే బస్సుల్లో 50 వేల మందికి పైగా జనం ఊళ్లకు బయలుదేరి వెళ్లారు. అయితే బస్టాపుల్లో సరిపడా టాయిలెట్లు లేక చిన్నారులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ, జీహెచ్ఎంసీ అధికారుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆయా స్టాపుల్లో చిన్నపిల్లలతో చలికి వణుకుతూ మహిళలు రోడ్లపైనే నిలబడ్డారు.