సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్, సికిందరాబాద్ బస్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ రోజు రోజుకూ పెరుగుతోంది. నగరవాసులు పండుగకు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తుండటంతో హైదరాబాద్, జేబీఎస్ బస్టాండ్లతో పాటు కాచిగూడ, సికింద్రాబాద్, చర్లపల్లి స్టేషన్లలో రద్దీ పెరిగిపోయింది.
జంటనగరాల్లో అతిపెద్ద రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పండుగ రద్దీ నెలకొంది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే (SCR) సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని 100 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. చాలా మంది టిక్కెట్లను వీకెండ్ కు బుక్ చేసుకోవడంతో రాబోయే కొద్ది రోజుల్లో ప్రయాణికుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా జంటనగరాల్లోని బస్ స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజిబిఎస్), జూబ్లీ బస్ స్టేషన్ (జెబిఎస్) రెండూ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
పండుగ సందర్భంగా వాహనాల రాకపోకలతో జాతీయ, రాష్ట్ర రహదారు రద్దీగా మారాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై గురువారం నుంచి భారీగా ట్రాఫిక్ పెరిగిపోయింది. రద్దీని తగ్గించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పటికీ కార్లు, బస్సులు, ఇతర రవాణా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద బారులు తీరుతున్నాయి.