మంచిర్యాల బస్టాండ్ లో ‘సంక్రాంతి’ రష్ 

మంచిర్యాల, వెలుగు: సంక్రాంతి ప్రయాణికుల రద్దీతో మంచిర్యాల బస్టాండ్​ శనివారం కిటకిటలాడింది. విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇంటిబాట పట్టారు.  సోమ, మంగళవారాలు హాలీడేస్​ కావడం, రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు కుటుంబాలతో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పొద్దటి నుంచి రాత్రి వరకు బస్టాండ్​లో ఫుల్​రష్​ కనిపించింది.  

ఆర్టీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​కు 20 స్పెషల్​ బస్సులను నడుపుతున్నప్పటికీ సరిపోని పరిస్థితి. కరీంనగర్​, జగిత్యాల, ఆసిఫాబాద్​, కాగజ్​నగర్​, చెన్నూర్​ రూట్లలో బస్సుల్లో నిల్చోవడానికి  జాగ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో కూడా ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు.