హైదరాబాద్‌‌ – విజయవాడ హైవేపై సంక్రాంతి రష్‌‌..ఆంధ్రా వైపు వాహనాల బారులు

  • ఎక్కడికక్కడ ట్రాఫిక్‌‌ జామ్‌‌
  • రైల్వే, టూరిజం డిపార్ట్‌‌మెంట్‌‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సర్వీసులు

చౌటుప్పల్, వెలుగు : విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై సంక్రాంతి రద్దీ ప్రారంభమైంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడం, సాఫ్ట్‌‌వేర్‌‌ ఉద్యోగులకు శని, ఆదివారాలు కలిసి వస్తుండడంతో శుక్రవారమే సొంతూళ్లకు బయలుదేరారు. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌‌ పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. రద్దీని దృష్టిలో పెట్టుకొని పోలీస్‌‌ యంత్రాంగం, టోల్‌‌ప్లాజా సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

పంతంగి టోల్‌‌ప్లాజా వద్ద మొత్తం 16 గేట్లు ఉండగా ఇందులో విజయవాడ వైపు 10, హైదరాబాద్‌‌ వైపు 6 గేట్ల ద్వారా వాహనాలను పంపిస్తున్నారు. హైవేపై ట్రాఫిక్‌‌ జామ్‌‌ ఏర్పడకుండా, ప్రమాదాలు జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. శనివారం, ఆదివారం హైవేపై మరింత రద్దీ ఉండే అవకాశం ఉంది.

పండుగకు ప్రత్యేక రైళ్లు, బస్సులు

హైదరాబాద్‌‌/హైదరాబాద్‌‌ సిటీ, వెలుగు : సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారితో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రైళ్లకు ఫుల్‌‌ డిమాండ్‌‌ ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 188 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. అలాగే మరో 178 ప్రత్యేక రైళ్లు ఈ జోన్‌‌ గుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో పండుగ సీజన్‌‌లో మొత్తం 366 ప్రత్యేక రైల్‌‌ సర్వీసులు నడుస్తాయని ఆఫీసర్లు తెలిపారు.

కొత్తగా ప్రారంభమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌‌ నుంచి నర్సాపూర్, కాకినాడ, శ్రీకాకుళం వైపు 59 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు. ఇందులో 16 జనసాధారణ రైళ్లను చర్లపల్లి నుంచి విశాఖపట్నం, అక్కడి నుంచి తిరిగి చర్లపల్లి వరకు నడుపుతున్నారు. సాధారణ రైళ్లలో రద్దీని తగ్గించడం, వెయిటింగ్‌‌ లిస్ట్‌‌ను క్లియర్‌‌ చేయడం కోసం 15 ఎక్స్‌‌ప్రెస్‌‌ రైళ్లకు అదనపు కోచ్‌‌లను జోడిస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. 

టూరిజం శాఖ ఆధ్వర్యంలో...

సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని పురస్కరించుకొని టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆ డిపార్ట్‌‌మెంట్‌‌ఎండీ ప్రకాశ్‌‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరు, కాకినాడ, విశాఖపట్నం రూట్లలో బస్సులు నడుపుతున్నామన్నారు.

విజయవాడకు పెద్దవారికి రూ.1200, పిల్లలకు 960, ఏలూరుకు పెద్దలకు రూ.1500, పిల్లలకు రూ.1200, కాకినాడకు పెద్దలకు రూ. 2100, పిల్లలకు రూ.1680, విశాఖపట్నంకు పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400 టికెట్‌‌గా నిర్ణయించినట్లు తెలిపారు. టికెట్‌‌ బుకింగ్‌‌ కోసం www.tgtdc.in వెబ్‌‌సైట్‌‌లో చూడాలన్నారు.