యాదాద్రి, వెలుగు: సంక్రాంతి పండుగకు పట్నం నుంచి పల్లెలకు వెళ్లే వెహికల్స్ తో యాదాద్రి జిల్లా హైవే రోడ్లపై భారీగా రద్దీ ఏర్పడింది. క్షణం తీరిక లేకుండా వేలాది వెహికల్స్ పల్లెబాట పట్టాయి. జిల్లాలోని విజయవాడ, వరంగల్ హైవేల మీదుగా ప్రతి సెకనుకు ఒకటి కంటే ఎక్కువే వెహికల్స్ వెళ్లాయి. శుక్రవారం సాయంత్రం 4 నుంచి శనివారం రాత్రి 9 వరకూ 29 గంటల్లో యాదాద్రి జిల్లాలోని రెండు హైవేల మీదుగా లక్షకుపైగా వెహికల్స్ రాకపోకలు సాగించాయి.
అంటే.. 29 గంటలకు 1,04,400 సెకన్లు కాగా.. అంతకంటే 15,600 ఎక్కువగానే మొత్తం 1,20,000 వెహికల్స్ ప్రయాణించాయి. హైదరాబాద్– వరంగల్ హైవేపై 52,914 .. హైదరాబాద్–విజయవాడ హైవేపై 68 వేలకు పైగా వెహికల్స్ ప్రయాణించినట్టుగా తెలుస్తోంది. రద్దీ భారీగా పెరగడంతో విజయవాడ హైవేపై పంతంగి టోల్ ప్లాజా, వరంగల్ హైవేపై గూడూరు టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. పంతంగి వద్ద హైదరాబాద్ వైపు వెళ్లే వెహికల్స్ను సర్వీస్ రోడ్డు మీదుగా పంపించారు. విజయవాడ వైపు వెళ్లే వాటిని రెండు వైపుల నుంచి పంపిస్తున్నారు. అయినా, టోల్ చెల్లింపుల నేపథ్యంలో వాహనాలు నిదానంగా కదులుతున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది.