అభివృద్ధిలో రాకెట్ వేగంతో దూసుకుపోతున్న నేటి రోజుల్లో ఎన్నో వింత ఆచారాలు, మూఢనమ్మకాలు సమాజంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని రూపుమాపేందుకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతుంటే మరోవైపు అటువంటి నమ్మకాలు రోజుకొకటి తెరమీదకు తీసుకువస్తూ వాటిని ప్రచారం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
సంక్రాంతి పండగ రాబోతున్న వేళ ఇంటర్నెట్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒక్కడే కొడుకు ఉన్న మహిళలు వెంటనే పరిహారం చేసుకోవాలని... లేకుంటే కీడు తప్పదంటూ ఓ ప్రచారం పట్టణాల నుంచి పల్లెల వరకు స్పీడ్‌గా పాకుతోంది. దీంతో ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఒక్క కొడుకు ఉంటే కీడు
ఈ సంవత్సరం(2024) సంక్రాంతి పండగ కీడు వచ్చింది. అందుకని ఒక్క కొడుకు ఉన్న మహిళలు, ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది కుమారులు ఉన్న మహిళల వద్ద నుంచి డబ్బు తీసుకొని... ఆ డబ్బుతో వారు ఐదు రకాల గాజులు కొనుక్కుని వాటిని ధరించాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సంక్రాంతి పండగ లోపు పూర్తి చేయాలి. లేకుంటే కీడు తప్పదు’ అంటూ ఓ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతున్నది. దీంతో ఈ విషయం చెవిన పడ్డ ఒక్క కొడుకు కలిగిన మహిళలంతా ఇద్దరు కుమారులు కలిగిన తమ బంధువులు, ఫ్రెండ్స్ వద్ద నుంచి డబ్బులు తీసుకుని గాజులు ధరిస్తున్నారు. అలా తాము ధరించిన గాజులతో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
ఈ ప్రచారాన్ని నమ్మి ఆచరిస్తున్న వారు కొందరుంటే ఇదంతా ట్రాష్ అని మరికొందరు వాదిస్తున్నారు. గతంలోనూ సంక్రాంతి, ఉగాదితో పాటు వివిధ పండగలకు ముందు వదిన మరదళ్ళు గాజులు, అన్నదమ్ములకు కుడుకలు, ఆడబిడ్డలకు కుంకుమ భరణాలు, వదిన ఆడపడుచులు చీరలు పంచుకోవాలి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాగే బంగారం, వెండి మాట్లాడుతుందంటూ గ్రామాల్లో పుకార్లు షికార్లు చేసిన విషయాలు తెలిసిందే. ఈసారి సంక్రాంతికి ముందు ఐదు రకాల గాజులు ధరించకుంటే కీడు తప్పదంటూ కొత్త పుకారు తెరమీదకు తీసుకవచ్చారు. ఇలాంటి విషయం ఏ పురాణంలో లేదని .. పెద్దలు .. రుషులు.. ఎవరూ ఆచరించిన దాఖలాలు లేవని పండితులు చెబుతున్నారు. కొంతమంది వ్యాపారులు, స్వార్దం కోసం ఇలాంటి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విద్యావేత్తలు చెబుతున్నారు. ఇటువంటి ప్రచారంతో ఆయా వ్యాపారులే లబ్ధి పొందుతారు తప్ప ఎవరికి ఏ హాని జరగదని వాదిస్తున్నారు.