- సామాజిక వర్గాలవారీగా చీలిన లీడర్లు
- కులాలవారీగా ఆశావహులకు మద్దతు
- బీఆర్ఎస్లోని కమ్మ నేత కోసం బలమైన లాబీయింగ్
- అయోమయంలో ‘జలగం’ అనుచరులు
ఖమ్మం, వెలుగు : ఖమ్మం లోక్‌సభ టికెట్‌పై బీజేపీలో సంకుల సమరం నడుస్తున్నది. సంస్థాగతంగా పెద్దగా బలం లేని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ టికెట్ కోసం నెలకొన్న పోటీ రాజకీయవిశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఖమ్మం బీజేపీ టికెట్ కోసం సుమారు పది మంది ఆశావహులు రేసులో ఉండగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పార్టీలో చేరాక దాదాపు అందరూ ఆశలు వదిలేసుకున్నారు. తీరా హైకమాండ్ఆయన పేరును ప్రకటించకపోవడంతో ఆశావహులంతా మళ్లీ యాక్టివ్ అయ్యి, తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
హైదరాబాద్ కేంద్రంగా కులాలవారీగా తమ గాడ్ ఫాదర్ల ను ప్రసన్నం చేసుకోవడం, ఆయా నాయకులు కూడా హామీ ఇస్తుండడం ఆసక్తి రేపుతోంది. మరోవైపు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పటికీ జలగం వైపే మొగ్గుచూపుతుండగా, బీఆర్ఎస్ నుంచి ఓ ముఖ్య నేతను లాగేందుకు కమ్మవర్గానికి చెందిన నేతలు దిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తుండడంతో వెంకట్రావు , ఆయన అనుచరులు అయోమయంలో పడ్డారు.
సామాజిక వర్గాలవారీగా నేతల మద్దతు
ఖమ్మం టికెట్ ఆశిస్తున్న వారిలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు కాగా, ఆయనకు మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు మద్దతిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు కాగా, బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మద్దతిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
2019 ఎన్నికల్లో పోటీ చేసిన దేవకీ వాసు దేవరావుది ఆర్యవైశ్య సామాజికవర్గం. ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు పద్మశాలి సామాజికవర్గానికి చెందినవారు కాగా, ఆయనకు టికెట్ ఇవ్వాలని పొంగులేటి సుధాకర్ రెడ్డి కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే వెలమ సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇవ్వాలని ఈటల రాజేందర్, ఇటీవల పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు (వెలమ)కు టికెట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇక బీజేపీ సీనియర్ నేత, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవీ రమేశ్(గౌడ్) టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు.
దిల్లీ స్థాయిలో లాబీయింగ్..
రాష్ట్రంలో బీజేపీ ఇప్పటి వరకు ప్రకటించిన వారిలో ఒక్క కమ్మ అభ్యర్థికి కూడా లేడని, ఖమ్మం టికెట్ ఎలాగైనా కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలంటూ బీజేపీలో డిమాండ్లు వినిపిస్తున్నాయి. బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ టికెట్ రేసులో ఉండగా, అదే సామాజికవర్గానికి చెందిన మరో ముఖ్య నేత కోసం కమ్మ సామాజికవర్గానికి చెందిన రాష్ట్ర నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న ఆ లీడర్ కు టికెట్ ఇప్పించేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ద్వారా దిల్లీ స్థాయిలో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. ఆయనకు పార్టీలో రూట్ క్లియర్ చేసేందుకే ఇంకా ఖమ్మం టికెట్ పెండింగ్ పెట్టారన్న టాక్ నడుస్తోంది.