హైదరాబాద్​ లో గ్లోబల్​ కంపెనీలను విస్తరిస్తాం: మంత్రిశ్రీధర్​ బాబు

హైదరాబాద్​ లో గ్లోబల్​ కంపెనీలను విస్తరిస్తాం: మంత్రిశ్రీధర్​ బాబు

తెలంగాణలో కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సీఎం రేవంత్​ రెడ్డి, మంత్రులు రాష్ట్రాభివృద్దిపై దృష్టి పెట్టారు.  తెలంగాణలో కొత్తగా ఎలక్ట్రానిక్‌ ,ఐటీ కంపెనీలు ఇతర ఉత్పత్తుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు  వివిద కంపెనీల ప్రతినిథులు చర్చించిన  ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు మరో  గ్లోబల్​ సంస్థను తెలంగాణలో విస్తరించేందుకు శ్రీకారం చుట్టారు. 
సనోఫి’ లైఫ్ సైన్సెస్ సంస్థ తన గ్లోబల్ సామర్థ్య విస్తరణపై వచ్చే ఆరేళ్లలో రూ.3 వేల658 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి కార్యాచరణ రూపొందించిందని  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. బుధవారం (జులై17)  నాడు ఆయన రాయదుర్గంలో సనోఫి గ్లోబల్ సామర్థ్య కేంద్రం విస్తరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వచ్చే ఏడాది కాలంలో రూ.914 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు జరుగుతాయని శ్రీధర్ బాబు తెలిపారు. దీని వల్ల వచ్చే రెండేళ్లలో 2 వేల 600 కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు. 

ALSO READ | గ్రామీణంపై బడ్జెట్​ ఫోకస్:కేర్‌‌‌‌ఎడ్జ్ రేటింగ్‌‌‌‌ అంచనా

ప్రపంచవ్యాప్తంగా పోలియో వ్యాక్సిన్ ను ప్రవేశ పెట్టిన మొదటి ఫార్మా కంపెనీగా సనోఫికి పేరుందని ఆయన చెప్పారు. సనోఫి విస్తరణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతుందని మంత్రి వెల్లడించారు. బహుళ జాతి ఔషధ కంపెనీల ఏర్పాటుకు, సామర్థ్య వృద్ధికి తమ ప్రభుత్వం అనుకూల వాతావరణం కల్పించిందని శ్రీధర్ బాబు తెలిపారు.ఇప్పటికే అమెరికాలో పర్యటించిన మంత్రి   మైక్రోలింక్‌ యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయన్నారు. డేటా ట్రాన్స్‌ మిషన్‌, నెట్‌వర్కింగ్‌ కేబుల్స్‌, ఐవోటీ, మల్టీలెవల్‌ పార్కింగ్‌ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్‌ నెట్‌వర్క్‌ గ్లోబల్‌ లీడర్‌గా ఉందని చెప్పారు. తెలంగాణలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరత లేదని ఆయన వెల్లడించారు.