అంటరానితనంపై అలుపెరగని పోరు

సంత్ గాడ్గే బాబా అసలు పేరు ‘దేబూ’. తలపై మట్టి మూకుడు, చేతిలో చీపురు ఆయనకు ప్రతీకలుగా ఉండేవి. ఎప్పుడూ చేతిలో చీపురుతో వీధులను శుభ్రపరుస్తూ.. కీర్తనలతో జనాలను చైతన్యపరుస్తూ స్వచ్ఛతను భోదించే వారు. దర్జీల దగ్గర మిగిలిపోయిన గుడ్డ ముక్కలతో కుట్టుకున్న దుస్తులు వేసుకునే వారు. మట్టి మూకుడును తలపై టోపీలా పెట్టుకునేవారు. భిక్ష అవసరమైనప్పుడు భిక్షాపాత్రగా, తర్వాత శుభ్రపరుచుకొని తల మీద టోపీలా ధరించేవారు. మరాఠీ భాషలో మట్టి మూకుడును ‘గాడ్గే’ అంటారు. అందుకే ఆయనకు గాడ్గే బాబా అని పేరు వచ్చింది. నాటి సాంఘిక దురాచారాలను మార్చడానికి తన కీర్తనలనే ఆయుధంగా మార్చుకున్నారు. ‘గోపాల గోపాల దేవకీ నందన గోపాల’ మకుటంతో గాడ్గే బాబా పాడిన కీర్తనలు మరాఠీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా ద్యారపు తాలూకా షేన్గావ్ లో 1876 ఫిబ్రవరి 23న సక్కుబాయి, సింగ్రాజి దంపతులకు గాడ్గే బాబా జన్మించారు. వీరిది బట్టలు ఉతికే ‘పరిత్(రజక)’ కులం. అక్కడ అది షెడ్యూల్ కులాల జాబితాలో ఉంది.

మూఢనమ్మకాలపై ఎక్కుపెట్టిన బాణం

నిరక్షరాస్యుడైనప్పటికీ సంత్ గాడ్గేబాబా నోటి నుంచి కీర్తనలు అలవోకగా జాలువారుతుండేవి. అవి నాటి ప్రజానీకాన్ని మేల్కొలుపుతుండేవి. అందుకే పీకే ఆత్రే అనే మరాఠీ సాహితీవేత్త సింహాన్ని అడవిలోనే చూడాలి, గాడ్గే బాబాను కీర్తనల్లోనే చూడాలి అని అనేవారు. భక్తి సంప్రదాయంలో గాడ్గే బాబా అత్యుత్తమ వాగ్గేయకారుడని ‘సింగింగ్ ఏ హిందూ నేషన్.. మరాఠీ డివోషనల్ ఫెర్ఫార్మెన్సెస్’ పుస్తక రచయిత ప్రొఫెసర్ అన్నా ఘల్జ్​ పేర్కొన్నారు. నాటి సంప్రదాయం ప్రకారం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా జంతు బలులు, మద్యపానం తప్పనిసరిగా ఉండేది. దేబూకు కూతురు అలోక పుట్టిన సందర్భంగా మేకను బలివ్వాలి . బంధువులకు మద్యం పోయాలి. కానీ దేబూ దీనికి ఒప్పుకోలేదు. కూతురు పుట్టినందుకు మరో జంతువు ప్రాణం ఎందుకు తీయాలని ప్రశ్నించారు. ఏ శాస్త్రాలు, గ్రంథాల్లో అలా రాశారంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. జంతు బలుల్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఆయన.. మద్యపానం మంచిది కాదన్నారు. నిమ్నకులాల్లో నాడు జంతు బలి, మద్యం లేకుండా జరిగిన శుభకార్యం బహుశా మహారాష్ట్ర మొత్తంలో అదే మొదటిది కావచ్చు. తర్వాత కాలంలో జంతు పరిరక్షణ కోసం గోశాలలు కట్టించిన మహనీయుడు గాడ్గేబాబా. 

అంటరానితనంపై అలుపెరగని పోరు

బ్రాహ్మణులను ఎవరు సృష్టించారని గాడ్గే బాబా ఒక సందర్భంలో ప్రజలను అడిగారు. దానికి వారు దేవుడు అని సమాధానం చెప్పారు. మరి మహర్, మాంగ్ లను ఎవరు సృష్టించారని బాబా అడిగితే దేవుడే అని చెప్పారు. మరి అందరినీ దేవుడే సృష్టిస్తే వారు అంటరానివారు ఎలా అయ్యారని ప్రశ్నించారు. ప్రశ్నలకు, ప్రశ్నల ద్వారానే సమాధానం రాబట్టడం గ్రీకు తత్వవేత్త సోక్రటీస్​ నైజం అనుకుంటే గాడ్గే బాబా కూడా సోక్రటీసే. అందుకే సోక్రటీస్, గాడ్గే బాబా మధ్య పోలికలను పరిశీలించిన మృణ్మయ్ విజయ్ దేవ్ అనే రచయిత బాబాను ‘మహారాష్ట్ర సోక్రటీస్’గా అభివర్ణించారు. సత్యం, మంచితనం, న్యాయం సోక్రటీస్ సూత్రాలైతే.. మంచితనం, సమానత్వం, స్పృశ్యత బాబా నమ్మిన విలువలు. ఇద్దరూ మౌఖిక పద్ధతుల్లోనే సమాజంలోని మూఢ విశ్వాసాలపై పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతులను చేశారు. గాడ్గేబాబాలో సోక్రటీస్ ప్రశ్న, సమాధానం పద్ధతులతోపాటు బుద్ధుడి సంభాషణ పద్ధతి కూడా గమనించవచ్చు. అంటరానితనం వలన సమాజం విచ్ఛిన్నం అవుతోందని, ఇది ఎంతమాత్రం మంచిది కాదన్నారు బాబా. పురుషులతోపాటు స్త్రీలు కూడా అభివృద్ధి చెందితేనే సమాజం మరింత వికసిస్తుందని అభిలషించారు.

చదువు కోసం ఎంతో ఆరాటం

‘జ్ఞానమే సర్వస్వం.. చదువే దానికి మార్గం కాబట్టి తల్లిదండ్రులారా మీకు ఎంత కష్టమైనా సరే మీ పిల్లలను చదివించండి, విద్యావంతులను చేయండి. అవసరమైతే తినే పళ్లాలను అమ్ముకోండి రొట్టె ముక్క అరచేతిలో పెట్టుకొని తినవచ్చు. కానీ మీ పిల్లలకు చదువు చెప్పించండి’ అని గాడ్గే బాబా ప్రబోధించారు. పిల్లలను బడికి పంపించడమే పుణ్యం - వారిని చదువుకు దూరం చేయడం పాపం అని చెప్పారు. ఎన్నడూ బడి ముఖం చూడని ఒక సాధువు సమాజంలో చదువు కోసం ఇంతగా ఆరాటపడుతున్నాడంటే ఆయన దార్శనికతను మనం అంచనా వేయవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  పరిచయం తర్వాత ఆయనలో చదువు పట్ల ఆసక్తి మరింత పెరిగింది. గాడ్గే బాబా మహారాష్ట్రలో విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. కర్మవీర్ బాపు రావ్ తో కలిసి 1924లో పూనేలో ఛత్రపతి సాహు వసతిగృహం ఏర్పాటు చేశారు. 1932లో పేద పిల్లల కోసం యూనియన్ బోర్డింగ్ హౌస్ పేరుతో మరో హాస్టల్ ను ప్రారంభించారు. 1940లో సతారాలో ఒక హైస్కూల్ ను ప్రారంభించారు.

నిచ్చెన మెట్ల కులవ్యవస్థలో గుర్తింపేది?

నిమ్నవర్గాల వారు చట్టసభల్లోకి రావడాన్ని అప్పటి అగ్రకుల నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. గాడ్గే బాబా మాత్రం మేం తరతరాలుగా మీ బట్టలు ఉతుకుతూనే ఉండాలా? మేం ఎందుకు చట్టసభలకు అర్హులం కాదు? బ్రాహ్మణులే అందుకు అర్హులైతే బ్రాహ్మణేతరులను అందరినీ బ్రాహ్మణులుగా మార్చండి లేదా మమ్మల్ని( బ్రాహ్మణేతరులను) చట్టసభల్లోకి అనుమతించండి అంటూ ధిక్కార స్వరం వినిపించారు. అంబేద్కర్ ఒక్కరే నిమ్న వర్గాల విముక్తి ప్రదాత అని ఆయన తరచు చెప్పేవారు. గాంధీజీ కంటే ముందే స్వచ్ఛ భారతావని కోసం ఉద్యమించినా, అంటరానితనాన్ని రూపు మాపేందుకు విశేష కృషి చేసినా, తన కీర్తనలతో సమాజాన్ని చైతన్యవంతం చేసినా, విద్యావ్యాప్తికి ఎంతగానో కృషి చేసినా నిచ్చెన మెట్ల కులవ్యవస్థ కారణంగా గాడ్గే బాబాకు రావలసినంత గుర్తింపు రాకపోవడం విచారకరం. నిస్వార్థంగా సేవలు అందించి సమాజానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడికి ఇప్పటికైనా భారతరత్న ప్రకటించాలి. ఆయన సేవలను, ఆశయాలను ముందుకు తీసుకువెళ్లి, ఆ స్ఫూర్తిని కొనసాగించడమే మనం ఆ మహనీయునికి అర్పించే ఘనమైన నివాళి.

మరో సిద్ధార్థుడిలా..

దేబూకు మానవ జీవితం, పుట్టుక, చావు, దేవుడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? విగ్రహాల్లో ఉంటాడా? పూజిస్తే, జంతు బలులు ఇస్తే, కానుకలు సమర్పిస్తే సంతసించి వరాలిస్తాడా? అనే సంఘర్షణ ఆయన కొడుకు ముద్గల్ అనారోగ్యంతో మరణించిన తర్వాత మొదలైంది. ఈ సంఘర్షణ ఆయనను తీవ్రంగా కలచివేసింది. సత్యాన్వేషణ చేయాలనుకుని గర్భవతిగా ఉన్న భార్యను, కూతురిని, కన్నవారిని వదిలి తన 29వ ఏట 1905, ఫిబ్రవరి 5న ఇంటి నుంచి సర్వసంగ పరిత్యాగిలా జ్ఞానాన్వేషణకై మరో సిద్ధార్థుడిలా బయలుదేరారు. ఆశ్చర్యకరమేమంటే ఇంటిని విడిచిపెట్టినప్పుడు గౌతమబుద్ధుడి వయసూ 29 సంవత్సరాలే. ఇద్దరూ ఋషి పుంగవులే. ఇద్దరూ జ్ఞాన బోధకులే. ఇద్దరూ సర్వసంగ పరిత్యాగులే. ఇద్దరూ జ్ఞానాన్వేషకులే. ఇద్దరూ సామాజిక చైతన్యపరులు. విప్లవకారులే.


పరిశుభ్రతే దైవమని ప్రవచించి, ఆచరించిన తొలితరం సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు సంత్ గాడ్గే బాబా. చీపురుతో వీధులను, కీర్తనలతో మస్తిష్కాలను శుభ్రం చేసిన వాగ్గేయకారుడు. గుడికి బదులు బడిలోనే ఆధ్యాత్మికతను వెతికిన మహాయోగి. మహాత్మా గాంధీ కంటే ముందే మన దేశంలో పరిశుభ్రత అత్యంత ఆవశ్యకమని గుర్తించి తాను ఆచరిస్తూ, వీధులను శుభ్రపరుస్తూ స్వఛ్చతలో నవభారతానికి నాంది పలికారు సంత్ గాడ్గేబాబా. దేశంలోని సాంఘిక అసమానతలు, సామాజిక సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసిన యోధుడాయన. సమస్త ఛాందసాలనూ హేతువుతో ఖండించిన సాధువు. ప్రకృతిని కాపాడుకోవాలని చెప్పిన పర్యావరణ ప్రేమికుడు. తన యావత్ జీవితాన్ని సంఘ సేవకై అర్పించిన సర్వసంగ పరిత్యాగి.
- కొంగల వెంకట్, రాష్ట్ర అధ్యక్షుడు, 
ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం