బంజారాలకు మార్గదర్శి సంత్ సేవాలాల్ మహారాజ్

బంజారాలకు మార్గదర్శి సంత్ సేవాలాల్ మహారాజ్

యధా యధాహి ధర్మస్య గ్లానిర్భవతు భారత అంటూ ధర్మానికి హాని కలిగినప్పుడు జన్మిస్తానన్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి కారణజన్ముడు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్. బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచాడు, లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. 10 కోట్ల లంబాడా ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా మాట్లాడుకోగలుగుతున్నారు. స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు , ఆచారవ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుం టున్నారు .‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. రాజుల కాలం నుం చి బ్రిటిష్‌ కాలం వరకు బంజారాలు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించేవారు. ఆ క్రమంలో బ్రిటిష్‌, ముస్లిం పాలకుల మత ప్రచారంతో బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. అలాంటి పరిస్థితులలో బంజారాలను మంచిమార్గంలో నడిపించడానికి సేవాలాల్‌ అవతరించారు.ఆయన బోధనల ద్వారా బంజారా జాతినడచుకుంది.

1739 ఫిబ్రవరి 15న అనంతపూర్‌ జిల్లా రాంజీనాయక్‌ తండాలో భీమా నాయక్, ధర్మిణి భాయి దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్తేటప్పుడు తల్లి కట్టియిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసే వాడు. తాను బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవాడు. ఈ వింత ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది. జాతర్ల సమయంలో జంతుబలిని ఒప్పుకునేవాడు కాదు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని సేవాలాల్‌ తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర ఉంచుతాడు.‘నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమ’ని ప్రార్థిస్తాడు. అమ్మవారు కరుణిస్తుంది. సేవాలాల్కి  మరలా ప్రాణం పోస్తుంది.‘నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి’ అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి జగదాంబ మాతనే తన గురువుగా స్వీకరించాడు. అన్ని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. సేవాలాల్‌ మహరాజ్‌ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్‌’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం ,ధూమ పానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లో నే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు. ఒకప్పుడు హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన రాజు… సేవాలాల్‌ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలిం చాడని చరిత్ర తెలుపుతోంది. సామాన్యునిగా పుట్టి అసామాన్యునిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్. మనిషి మనీషిగా ఎలా ఎదగాలో నేర్పినవాడు. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అందరూ ఆచరించాలి. మహారాష్ట్రలోని పౌరాగఢ్ లో తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి, వర్ధంతులను ఏటా అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది. నేను గత లోక్ సభలో ఈ దేశంలోని బంజారాల మనోభావాలను అనేక సందర్భాలలో ప్రభుత్వ దృష్టికి , ప్రధాని మోడీ దృష్టికి తెచ్చాను కానీ, ఇప్పటి వరకు దానిపై ఎలాంటి స్పందన లేదు. ప్రభుత్వం పౌరాగఢ్ లో కనీస వసతులు కల్పించడంలేదు. ఇప్పటికైనా మహారాష్ట్ర ప్రభుత్వం బంజరా ఉద్యోగులకు ఒక రోజు సెలవు ప్రకటించి, బంజారాల మనోభావాలను కాపాడాలి. బంజారాలను ఒకే గొడుగు కిందకు తేవాలని కోరుతున్నా ను. (ఈవాళ సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 281వ జయంతి)

—--ప్రొ. అజ్మీరా సీతారాం నాయక్ ,మాజీ ఎంపీ