అయిజ, వెలుగు : మండలంలోని వేణి సోంపురం గ్రామ సమీపంలో తుంగభద్రా నది తీరంలో వెలసిన సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఆలయంలోని శ్రీకృష్ణుడు, రుక్మిణీదేవి, సత్యభామ పంచలోహ ఉత్సవ విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఉదయం ఆలయ పూజారి గుండాచారి గుడికి వెళ్ళగా అప్పటికే తాళం తీసి ఉంది. అనుమానంతో తలుపులు తెరిచి చూడగా ఉత్సవ విగ్రహాలు కనిపించలేదు.
ఈ విషయాన్ని ఆయన గ్రామస్తులకు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న సర్పంచ్ నర్సోజీ, గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ నరేశ్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఆలయ సరిసరాలు పరిశీలించారు. తుంగభద్ర నదీ తీరంలో దొంగల ఆనవాళ్ల కోసం గాలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు.