![వనవాసుల ఆరాధ్యుడు..సంత్ సేవాలాల్](https://static.v6velugu.com/uploads/2025/02/santh-sevalal--birth-day-on-february-15th-special-story-of-samala-kiran_f8K6OQo3NU.jpg)
కారణ జన్ములు అనేకులు మన భారతగడ్డపై జన్మించారు. అలాంటి వారిలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఒకరు. సేవాలాల్ బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచాడు. ఆయన లిపిలేని బంజారాల భాషను ఒక పద్ధతిగా మార్చాడు. 10 కోట్ల లంబాడా ప్రజలు ఎక్కడైనా ఒకే రకంగా నేడు మాట్లాడుకోగలుగుతున్నారు.
స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, విలక్షణమైన దుస్తులు, ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. ‘సాతీ భవానీ (సప్త మాతృకల)’ పూజా విధానాలు ఆచరించే బంజారాల జాతికి ఆయనే దార్శనికుడు. రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు బంజారాలు ఆయా రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామాగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించేవారు.
ఆ క్రమంలో బ్రిటిష్, ముస్లిం పాలకుల మత ప్రచారంతో బంజారా సమాజం అనేక ఇబ్బందులకు గురయ్యింది. అలాంటి పరిస్థితులలో బంజారాలను మంచిమార్గంలో నడిపించడానికి సేవాలాల్ అవతరించారు. ఆయన బోధనల ద్వారా బంజారాజాతి నడుచుకుంది.
1739 ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో భీమా నాయక్, ధర్మిణి భాయి దంపతులకు జన్మించాడు. చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్ళేటప్పుడు తల్లి కట్టియిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసేవాడు. తాను బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవాడు. ఈ వింత ప్రవర్తన తల్లిదండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది.
జాతర్ల సమయంలో జంతుబలిని ఒప్పుకునేవాడు కాదు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని సేవాలాల్ అమ్మవారి కాళ్ల దగ్గర తన తలను ఉంచుతాడు. ‘నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇవ్వమ’ని ప్రార్థిస్తాడు. అమ్మవారు కరుణిస్తుంది. ‘నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు. అతని నాయకత్వంలో ప్రయాణించండి’ అని జగదాంబ ఆశీర్వదిస్తుంది. అప్పటి నుంచి జగదాంబ మాతనే తన గురువుగా స్వీకరించాడు.
ALSO READ : నక్సలిజం చరిత్రగా మిగలనుందా?
సేవాలాల్ మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం , ధూమపానం శాపమని హితవు పలికాడు. ఒకప్పుడు హైదరాబాదులో మశూచి వ్యాధి ప్రబలింది. అయితే, సంత్ సేవాలాల్ మహారాజ్ ఉన్న బంజారా హిల్స్ ప్రాంతానికి మాత్రం ఆ వ్యాధి సోకలేదు. ఆయన మహిమను గుర్తించిన రాజు.. సేవాలాల్ ఆశీస్సులతో ఆ వ్యాధిని నిర్మూలించాడని చరిత్ర తెలుపుతోంది.
ఆచరణ శీలి-ఆదర్శం
సామాన్యునిగా పుట్టి అసామాన్యునిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్. మనిషి మనీషిగా ఎలా ఎదగాలో నేర్పినవాడు. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అందరూ ఆచరించాలి. మహారాష్ట్రలోని పౌరాగఢ్ లో తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి, వర్ధంతులను ఏటా అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోంది.
ALSO READ : తెలంగాణలో అధ్వానంగా ఘన వ్యర్థాల నిర్వహణ
గిరిజనుల గొప్పతనం
లంబాడీలు, బంజారాలు, సుగాలీలు, గ్వార్ భాయ్ అని పిలవబడుతున్న ఈ గిరిజనులు ప్రపంచవ్యాప్తంగా గోర్ బంజారాలుగా పేరుపొందారు. మధ్య యుగంలో మహమ్మద్ ఘోరీకి వ్యతిరేకంగా పృథ్వీరాజ్ చౌహాన్ పక్షాన పోరాడిన వీరోచిత చరిత్ర బంజారాల సొంతం. దక్కన్ పీఠభూమిలో లంబాడీలు కాకతీయుల కంటే ముందే ఉన్నారని, సంచార జాతివారైనా వీరు రజాకార్లతో పోరాడారు. బంజారాలు ఎవరికీ హాని తలపెట్టేవారు కాదని, సహాయ గుణం విరివిగా కలవారని, ధైర్యసాహసాలకు ప్రతీకలనీ చరిత్ర ద్వారా తెలుస్తుంది.
- సామల కిరణ్-