నటుడిగా పలు చిత్రాల్లో నటించి గుర్తింపును అందుకున్న అభిషేక్ మహర్షి.. దర్శకుడిగా రూపొందించిన సినిమా ‘ప్రేమ్ కుమార్’. సంతోష్ శోభన్, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రాన్ని శివప్రసాద్ పన్నీరు నిర్మించారు. ఆగస్టు 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా అభిషేక్ మహర్షి చెప్పిన విశేషాలు.
‘‘మొదట్నుంచీ దర్శకుడు అవ్వాలనే కల ఉండేది. ముందు నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. తర్వాత రైటర్‌గా కొన్ని సినిమాలకు వర్క్ చేశా. ‘పేపర్ బాయ్’ టైమ్‌లోనే సంతోష్‌ను కలిసి.. ఓ షార్ట్ ఫిల్మ్ చేద్దామనుకున్నాం. నిర్మాత శివ ప్రసాద్ సపోర్ట్‌తో సినిమా చేశాం. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లోంచి ఓ కథను సెలెక్ట్ చేసుకున్నాం. నా కామెడీ టైమింగ్‌ను సంతోష్, శివ బాగా నమ్మేవారు. కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే లాంటి సినిమాలు చూసి ఇన్‌స్పైర్ అయి ఈ కథను రాశా. సినిమాల్లో పెళ్లి సీన్‌లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్ పెళ్లి ఆపుతాడు. హీరో హీరోయిన్లు కలిసిపోతారు. కానీ ఆ పెళ్లి కొడుకు గురించి ఎవ్వరూ ఆలోచించరు. వాడికి కూడా ఓ జీవితం ఉంటుంది. అది చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ సినిమాను తీశాం.
ఇలాంటి కాన్సెప్ట్‌పై ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినా.. ఇందులో పాయింట్ కొత్తగా ఉంటుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమిది. ఎక్కడా వల్గారిటీ, బూతులు ఉండవు. అమ్మానాన్నలతో కలిసి ఈ సినిమాను హాయిగా చూడొచ్చు. ఇందులో నా భార్య, నేను కూడా గెస్ట్ రోల్స్‌లో కనిపిస్తాం. మా టీంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఏమీ రాలేదు. స్క్రిప్ట్ లాక్ అయ్యాక అందులో ఎవ్వరూ ఏమీ వేలు పెట్టలేదు. సంతోష్ ఒక్కసారి సినిమా ఒప్పుకుంటే డైరెక్టర్ ఏం చేయమంటే అదే చేస్తాడు. హను రాఘవపూడి, సుకుమార్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, నగేష్ కుకునూర్ లాంటి దర్శకులతో నటుడిగా వాళ్లతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ఆ అనుభవాలన్నీ ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి’’.