Champions Trophy: భారత్‌ను ఓడించండి.. అదే పాక్ పౌరులకు మీరిచ్చే బహుమతి: సక్లైన్ ముస్తక్

Champions Trophy: భారత్‌ను ఓడించండి.. అదే పాక్ పౌరులకు మీరిచ్చే బహుమతి: సక్లైన్ ముస్తక్

ఛాంపియన్స్ ట్రోఫీ.. పాకిస్తానీలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏ విషయంలోనూ భారత్‌పై గెలవలేకపోతున్నామన్న బాధ వారిలో అంతకంతకూ పెరుగుతోంది. ముఖ్యంగా, భారత జట్టు ఆ దేశానికి వెళ్లలేదనే ఫ్రస్టేషన్ వారితో ఏం మాట్లాడిస్తోందో వారికే తెలియడం లేదు.

పాకిస్థాన్‪లో ఆడేది లేదని టీమిండియా తేల్చి చెప్పడంతో.. ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. భారత జట్టు ఆడే మ్యాచ్‌లు దుబాయిలో జరగనుండగా.. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్థాన్ వేదికల్లో జరగనున్నాయి. ఒకవేళ భారత జట్టు సెమీస్, ఫైనల్ చేరితే.. ఆ మ్యాచ్‌లు దుబాయ్ లోనే. ఇదే పాకిస్తానీలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య దేశం అన్న పేరు తప్ప.. ఈ టోర్నీ వల్ల తమకు దక్కిందేమీ లేదని వాపోతున్నారు.

తాజాగా, ఈ విషయంపై మాట్లాడిన పాక్ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముష్తాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్‌ వెళ్లని భారత జట్టుపై విమర్శలు గుప్పించారు. టీమిండియాను ఓడించి తగిన గుణపాఠం నేర్పాలని పాక్ ఆటగాళ్లకు సూచించారు.

రోహిత్, కోహ్లీలకు లక్షల్లో అభిమానులు.. 

"భారతీయుల కోపతాపాలు తగ్గడం లేదు. మన దేశంలో భారత క్రికెటర్లకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. రోహిత్, కోహ్లీ, బుమ్రాలను చూడాలనుకునే పాక్ అభిమానులు లక్షల్లో ఉన్నారు. వారు మాత్రం మన దేశానికి రమ్మంటే మొండికేస్తున్నారు. ఏ ప్రపంచంలో నివసిస్తున్నారో.. ఏమి సాధించాలనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. వారు అపారమైన తెలివి గలవారు. సంధర్భానికి తగ్గట్టు నాలుగు ముక్కలు ఇంగ్లీషులో మాట్లాడి విషయాన్ని చల్లారుస్తారు. మనకు కావలసింది అది కాదు. ఒక పాకిస్తానీగా నా వైఖరి వారికి తగిన గుణపాఠం నేర్పాలి. అదే అభిమానులకు మీరిచ్చే ఖరీదైన బహుమతి.." అని సక్లైన్ ముష్తాక్ ఒక టీవీ చర్చలో మాట్లాడారు.

నిజానికి సక్లైన్ ముష్తాక్ కోపం ఛాంపియన్స్ ట్రోఫీ గురించి కాదు. గతేడాది స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ సమయంలో భారత ప్రభుత్వం అతనికి వీసా మంజూరు చేయలేదు. దాంతో, బ్లాక్ క్యాప్స్‌తో కలిసి పనిచేయడానికి ఎంపికైన ఈ మాజీ స్పిన్నర్ సిరీస్ మొత్తానికి దూరమయ్యారు. ఆర్థికంగా నష్టపోయారు. ఆ కోపంతోనే ఇప్పుడిలా మాట్లాడారు.