
గతంలో సారా తాగి ప్రజలు రోగాల పాలయ్యేవారు. కుటుంబాలు వీధిన పడేవి. సారా కట్టడికి చర్యలు తీసుకున్నం. తెలంగాణను గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ద. సారా తయారీదారులకు ఉపాధి, పునరావాసం కల్పించాం’’ ..సీఎం కేసీఆర్, మంత్రులు చేసే వ్యాఖ్యలి వీ! కానీ రాష్ట్రంలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. పల్లెల్లో గుడుంబా మళ్లీ గుప్పుమంటోంది!!
రాష్ట్రంలోని పల్లెల్లో సారా మళ్లీ ఏరులై పారుతోంది. నల్లబెల్లం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. సారాకు బానిసై జనం అటు జేబులను ఇటు ఆరోగ్యాన్ని గుల్ల చేసుకుంటున్నారు. అధికారుల అమ్యామ్యాలతో సారా తయారీ మళ్లీ ఊపందుకుంటోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2014లో టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే సారాను సంపూర్ణంగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టింది. దీనిపై ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల వరకు గుడుంబా అదుపులోనే ఉంది. కానీ ఆ తర్వాత ఊపందుకుంది. ఎన్నికల్లో లిక్కర్ అక్రమ తరలింపు , లిమిటెడ్ విక్రయాలతో పల్లెల్లో సారాకు డిమాండ్ పెరిగిందని, విక్రయాలు కూడా ఎక్కువయ్యాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నా రు. అయితే ఇది తాత్కాలికమని వారు పేర్కొంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నల్లబెల్లం దొరక్కపోవడంతో చక్కెర వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని చోట్ల మొలాసిస్‌తో నాటు సారా కాస్తున్నారు. కల్తీ సారాతో కొందరు ఆస్పత్రుల పాలవుతుంటే ఇంకొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.
పెరుగుతున్న కేసులు
అక్టోబర్, నవంబర్ నెలల్లో సారా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తర్వాత మార్చిలో అధికంగా బుక్ అయ్యాయి. అక్టోబర్ లో 1,413 కేసులు నమోదు కాగా.. 653 మందిని అరెస్ట్ చేశారు. 1,3263 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని 54 వాహనాలను సీజ్ చేశారు. నవంబర్ లో 2,492 కేసులు నమోదు కాగా 603 మందిని అరెస్ట్ చేశారు. 1,9308 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకుని, 57 వాహనాలు సీజ్ చేశారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కాస్త తగ్గగా మార్చిలో మళ్లీ పెరిగింది. మార్చిలోలో 1,317 కేసులు నమోదు చేసి 603మందిని అరెస్ట్ చేశారు. 57,695 లీటర్ల సారాను స్వాధీనం చేసుకొని 54 వాహనాలను సీజ్ చేశారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు సారా తయారీకి వాడే 8.37 లక్షల లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా ఈ లెక్కలు మరింత ఎక్కువగా ఉంటాయంటున్నారు.
ఎక్కడెక్కువ?
ఎక్సైజ్‌శాఖ లెక్కల ప్రకారం పది ఉమ్మడి జిల్లాల్లో మొత్తం 572 మండలాలు ఉండగా 540 మండలాల్లో సారాను పూర్తిగా అరికట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో గుడుంబాను ఎక్కువగా తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా రామగుండం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్, ఎలిగేడు, మహాముత్తారం మండలాలు, మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం, గూడూరు, కేసముద్రం , మరిపెడ మండలాల్లోని తండాల్లో ఎక్కువగా తయారు చేస్తున్నట్లు సమాచారం. ఖమ్మం , నారాయణపేట, సిద్దిపేట, నాగర్ కర్నూల్, నల్లగొండ, సూర్యాపేట, ఇతర జిల్లాల్లోనూ సారా తయారీ, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
పునరావాసం కొందరికే
గుడుంబా వ్యాపారం మానుకున్న తర్వాత ప్రభుత్వం కొం దరికే జీవనోపాధి కోసం బ్యాంకుల ద్వారా రుణాలందించింది. కొన్ని చోట్ల గుడుంబా తయారీ ఆపేసినా ఎలాంటి పునరావాసం కల్పించలేదు. ఈ అంశాన్ని గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సింగ్ అసెంబ్లీలో లేవనెత్తారు. ‘‘ధూల్ పేటలో గుడుంబా తయారీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కానీ వారికి పునరావాసం కల్పించడంలో విఫలమైంది. స్వయంగా సీఎం కేసీఆర్ ధూల్ పేటలో పర్యటిస్తానని చెప్పారు. కానీ ఇప్పటిదాకా రాలేదు’’ అని ఆయన అసెంబ్లీలో అన్నారు. అధికారులు సైతం మామాళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. సారా తయారీదారుల నుంచి ముట్టాల్సినవన్నీ ముట్టుతున్నాయని, అందుకే చూసీచూడనట్లు వదిలేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి.