చారిటీ కోసం బ్యాట్ పట్టిన సచిన్.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

చారిటీ కోసం బ్యాట్ పట్టిన సచిన్.. సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

క్రికెట్ లో ఎంతమంది స్టార్ ఆటగాళ్ళున్నా సచిన్ స్థానం ప్రత్యేకం. రెండు దశాబ్దాలకు పైగా భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఒంటి చేత్తో మ్యాచ్ లు గెలిపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. క్రికెట్ గాడ్ అంటున్నారంటే సచిన్ క్రికెట్ పై ఎలాంటి ముద్ర వేశాడో మనం అర్ధం చేసుకోవచ్చు. 1989లో అంతర్జాతీయ క్రికెట్ లో తన కెరీర్ మొదలు పెట్టిన సచిన్.. 2013 లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ తర్వాత చివరిసారిగా 2022 లో లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఆడిన సచిన్..తాజాగా చారిటీ కోసం ఒక మరోసారి బ్యాట్ పట్టాడు. సచిన్ ఆటను చూసి కుమార్తె సారా టెండూల్కర్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. 

బెంగళూరులోని సత్యసాయి గ్రామాలోని సాయికృష్ణన్ క్రికెట్ స్టేడియంలో గురువారం ఛారిటీ మ్యాచ్ జరిగింది. వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ మధ్య జరిగిన ఈ మ్యాచ్ లో సచిన్ వన్ వరల్డ్ తరపున మ్యాచ్ ఆడారు. ఛేజింగ్ లో మాస్టర్ బ్లాస్టర్ మైదానంలోకి దిగే సమయంలో సారా టెండూల్కర్ తన తండ్రి బ్యాటింగ్ ఆడుతున్న వీడియో తీసుకుంది. తండ్రి క్లాసిక్ స్ట్రోక్‌లు, ట్రేడ్‌మార్క్ షాట్స్ చూసి పరవశించిపోయింది.
 
రికార్డ్ చేసిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ కథనంలో పోస్ట్ చేసింది. దీనికి ఏడుస్తున్న ఎమోజీతో పాటు 'నోస్టాల్జియా' అనే పదంతో క్యాప్షన్ యాడ్ చేసింది. హార్ట్ సింబల్ ఉన్న ఎమోజీతో తన భావాన్ని వ్యక్తం చేసింది. ఈ మ్యాచ్ లో సచిన్ 27 పరుగులు చేసి మురళీధరన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఏడు దేశాలకు చెందిన 24 మంది దిగ్గజ ఆటగాళ్లు ఈ మ్యాచ్ లో పాల్గొన్నారు. 

విద్య, ఆరోగ్య రంగాలకు సహాయం చేసేందుకు విరాళాల సేకరణ కోసం వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ కప్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలోని వన్ వరల్డ్ జట్టు.. యువరాజ్ సింగ్ నేతృత్వంలోని వన్ ఫ్యామిలీపై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. యువీ సేన నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని.. సచిన్ సేన మరో బంతి మిగిలివుండగానే చేధించింది.