ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు గెలుపు

ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు గెలుపు

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హంతకుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కొడుకు సరబ్జీత్ సింగ్ ఖల్సా గెలుపొందారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన..తన సమీప ప్రత్యర్థి, ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కరమ్‌జిత్ సింగ్ అన్మోల్‌పై 70 వేలకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. సరబ్జీత్ సింగ్ ఖల్సా తన ఎన్నికల ప్రచారంలో 1984 నాటి గోల్డెన్ టెంపుల్‌ దాడిని ఎక్కువగా గుర్తుచేశారు.

తన తండ్రి ఇందిరాగాంధీని ఎలా హత్య చేశాడో ఓటర్లకు వివరిస్తూ సిక్కులను తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. 2015లో పోలీసుల కాల్పుల్లో చనిపోయినవారి కుటుంబాలు, సిక్కు నాయకులు ఆయనకు మద్దతునిచ్చి ప్రచారం చేశారు. సరబ్జీత్ సింగ్ ఖల్సా తల్లి బిమల్ కౌర్ ఖల్సా గతంలో రోపర్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు.  అతని తాత సుచా సింగ్ 1989లో శిరోమణి అకాలీదళ్ అభ్యర్థిగా బటిండాలో గెలిచారు.