వాస్తవాలు గుర్తించకుండా కమ్యూనిస్టులపై విమర్శలా?

అసత్యాలతో వామపక్షాలపై దాడిచేయడం ఈ మధ్య ఒక ఫ్యాషన్‌‌గా మారింది. జరుగుతున్న పరిణామాలను గుర్తించకుండా కొంత మంది వారికి నచ్చినట్లు రాస్తున్నారు. ఈ నెల 24న ‘వెలుగు’ పత్రిక ఓపెన్​ పేజీలో ‘మరో చారిత్రక తప్పిదమా’ అని రిటైర్డ్​ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ ఓ వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో సాయుధ రైతాంగ పోరాట చరిత్రను, దానికి నాయకత్వం వహించిన నాయకుల పేర్లను ఉటంకించారు. ఆ నాయకులు పోరాటం దేని కోసం చేశారో ప్రొఫెసర్‌‌కు తెలియదేమో? భూమి కోసం, నిజాంను గద్దె దించడం కోసం జరిగిన పోరాటం అది. ఆ పోరాటం తర్వాత కూడా ప్రజా సమస్యల మీద రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు నిరంతరం ఆందోళనలు చేస్తూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. దాదాపు12 కోట్ల(కేరళ, బెంగాల్‌‌, త్రిపుర) ప్రజలను 30 ఏండ్లపాటు పాలించారు. ఈరోజు కేరళ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కమ్యూనిస్టుల పాలన లేకున్నా దేశంలో అగ్రగామిగానే ఉన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వంపైనా అనేక ఉద్యమాలు..

27 పారిశ్రామిక చట్టాలను 4 కోడ్‌‌లుగా మార్చివేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, సమ్మె హక్కును రద్దు చేసి కార్మికులను అన్యాయం చేసింది. 50 కోట్ల మంది కార్మికులు నేడు ప్రభుత్వ నిర్బంధానికి గురవుతున్నారు. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టు కార్మికులకు రక్షణ లేదు. లక్షల మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. గత సంవత్సరం ఫ్యాక్టరీల మూతతో 20 కోట్ల మంది వలస కార్మికులు పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లిన కష్టాలు ప్రొఫెసర్‌‌కు తెలియదనుకోవాలా? అప్పు తేకున్నా రూపాయి విలువ అధ్వానంగా తగ్గడంతో విదేశీ అప్పులు పెరుగుతున్నాయి.  బ్యాంకులను దివాళా తీయించే చర్యలు మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నది. ఇప్పటికే 27 మంది ప్రముఖ వ్యాపారవేత్తలు బ్యాంకులను దివాళా తీయించి విదేశాలకు పారిపోయారు. బీజేపీ విధానాలను అమలు జరిపితే దేశంలో పేదలకు నష్టమే. స్థానిక సమస్యలపై కమ్యూనిస్టులు రాష్ట్ర ప్రభుత్వంపై అనేక ఉద్యమాలు సాగిస్తూనే ఉన్నారు. కొన్నిటికి పరిష్కారాలు కూడా లభిస్తున్నాయి. మునుగోడు ఎన్నికలో బీజేపీ ఓడిపోవడాన్ని కొందరు భరించలేకపోతున్నారు. 

బీజేపీని ఎదుర్కొనేందుకు శాయశక్తులా..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేయడంతో పాటు వాటికి గల లౌకిక విధానాన్ని దెబ్బతీస్తున్నది. ప్రణాళికా బోర్డు నుంచి ఎన్నికల కమిషన్‌‌ వరకు అన్ని సంస్థలను తన రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నది. దేశంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నది. మతం పేరుతో సాగిస్తున్న దురాగతాలకు ఇప్పటికే వేలాదిమంది బలయ్యారు. పౌరహక్కుల చట్ట సవరణ ద్వారా మైనార్టీలకు హక్కులను హరించే ప్రయత్నం చేస్తున్నది. ఇటువంటి శక్తులు తెలంగాణలో బలపడితే రాష్ట్ర ప్రయోజనాలకు, లౌకిక విధానానికి ప్రమాదం వాటిల్లుతుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు తమకున్న పరిమిత శక్తి మేరకు కమ్యూనిస్టులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో కూడా అదే పని చేశారు. ఇది ప్రజలు అర్థం చేసుకున్నారు.

ప్రజావ్యతిరేక విధానాలపై

గత 8 ఏండ్లుగా అధికారం సాగిస్తున్న మోడీ, బీజేపీ, ఆర్‌‌ఎస్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రజల ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులను అధ్వాన స్థితికి తీసుకొస్తున్నది. రాష్ట్రాల హక్కులను కాజేసేవిధంగా చట్టాలను చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఖూనీ చేసి రాష్ట్రాల అధికారాలను మొత్తం లాగేసుకుంటున్నది. ఒకే దేశం, ఒకే భాష, ఒకే పన్ను పేరుతో హిందీ భాష, జీఎస్టీని ప్రజలపై రుద్దుతున్నది. ఏ రాష్ట్రం కూడా కేంద్రం అనుమతి లేకుండా విద్య, వైద్యాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు లేకుండా చేసిందన్న వాస్తవం రిటైర్డ్‌‌ ప్రొఫెసర్‌‌కు తెలియదా? మోడీ పాలనలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శాంతకుమార్‌‌ కమిషన్‌‌ సూచన మేరకు ఎఫ్‌‌సీఐని, సీసీఐని, నాఫెడ్‌‌ను ఎత్తివేస్తున్నారు. ఎరువుల సబ్సిడీని ఎత్తివేయడానికి ‘పీఎం ప్రణామ్‌‌’ పథకాన్ని ప్రవేశపెట్టారు. విత్తనరంగంలోకి విదేశీ బహుళజాతి సంస్థలకు అవకాశం కల్పించి దేశంలో వ్యవసాయ పరిశోధనలకు సున్నా చుట్టారు. ఆహార ఉత్పత్తి తగ్గించి దిగుమతులపై ఆధారపడే స్థితికి దేశాన్ని తెచ్చారు. వంటనూనెలు, పప్పులు, పంచదార, పత్తి, మాంసం తదితర వ్యవసాయ ఉత్పత్తులు రూ.4 లక్షల కోట్ల మేర దిగుమతి చేసుకుంటూ భారత రైతుల ఉత్పత్తులకు ధరలు తగ్గించివేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాపాడుకోవాలన్నా ముందు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలన్న విషయం మేధావులు గుర్తించాలి. - సారంపల్లి మల్లారెడ్డి