
మహాదేవపూర్/భూపాలపల్లి రూరల్, వెలుగు : సరస్వతి పుష్కర ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్ ఆదేశించారు. మే 15 నుంచి 26 వరకు జరగనున్న సరస్వతి పుష్కర ఏర్పాట్లపై గురువారం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, కమిషనర్ శ్రీధర్, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ కిరణ్‌ఖరేతో కలిసి గురువారం రివ్యూ నిర్వహించారు.
పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల ప్రగతిని పరిశీలించారు. సరస్వతీ విగ్రహం ఏర్పాటుకు స్థలం నిర్ణయించడం, వీఐపీ ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు రహదారి నిర్మాణం, పురుషులు, మహిళల కోసం శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు.
గోదావరి హారతికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, వీఐపీ ఘాట్ నుంచి గోదావరి ఘాట్ వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ఆఫీసర్లను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ప్రణాళికతో అన్ని డిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. శాశ్వత, తాత్కాలిక పనులకు సంబంధించి ముందుగానే షెడ్యూల్ తయారు చేసుకోవాలని, పనులు త్వరగా పూర్తయ్యేందుకు సిబ్బందిని పెద్ద సంఖ్యలో నియమించుకోవాలన్నారు.
అంచనాల్లో వ్యత్యాసాలు, చేపట్టే పనుల రిపోర్ట్‌ను రెండు రోజుల్లో అందజేయాలని సూచించారు. పుష్కర సమాచారం తెలిసేలా ప్రత్యేకంగా యాప్‌ను, ప్రచారానికి అంబాసిడర్‌ను నియమించాలని చెప్పారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లు వేయించాలని, 12 రోజులకు సంబంధించిన కార్యక్రమాల షెడ్యూల్‌ను తయారు చేయాలని ఈవోను ఆదేశించారు.
భక్తులకు అన్నదాన కార్యక్రమాలు, ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు వీఐపీ, గోదావరి ఘాట్ వద్ద చేపట్టనున్న పనులను, సత్రం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎండోమెంట్ ఆర్జేసీ రామకృష్ణారావుతో పాటు వివిధడిపార్ట్‌మెంట్ల ఆఫీసర్లు పాల్గొన్నారు.