మహదేవపూర్,వెలుగు: సరస్వతీ పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు గ్రాండ్ గా చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం జయశంకర్ భుపాలపల్లి జిల్లా మహదేవపూర్,కాటారం మండలాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహదేవపూర్ చౌరస్తా వద్ద రూ.32 లక్షలతో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ స్వాగత ఆర్చ్ గేట్ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ శివరాత్రిలోపు మహదేవపూర్ – కాళేశ్వరం ఫోర్ లైన్స్ రోడ్డు పూర్తయ్యేలా కృషి చేస్తామన్నారు. వచ్చే ఏడాది మే 17 నుంచి జరిగే సరస్వతీ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకొని సౌకర్యాలు మెరుగు పరిచేందుకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పుష్కరాలకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండగా అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేపడతామని చెప్పారు.