ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు సీఆర్పీసీ 164 ప్రకారం జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. గతంలో ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ బెంచ్ జడ్జి కావేరి భవేజా ఎదుట శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇవ్వడం గమనార్హం. ఇదే కేసులో ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. గతంలో శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ కోర్టుకు విన్నవించిన సంగతి తెలిపిందే.
శరత్ చంద్రారెడ్డి దక్కించుకున్న ఐదు జోన్లకు గాను ఒక్కో జోన్ కు రూ. 5 కోట్ల చొప్పున రూ. 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. శరత్ చంద్రారెడ్డి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో బెదిరించినట్టు సీబీఐ కోర్టుకు వివరించింది. కవితను రెండు రోజుల సీబీఐ కస్టడీ తర్వాత ఏప్రిల్ 23 వరకు జ్యూడిషియల్ రిమాండ్ కి పంపింది ప్రత్యేక కోర్టు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఆ జాబితాలో తాజాగా శరత్ చంద్రారెడ్డి కూడా చేరారు.