హైదరాబాద్, వెలుగు: దేశంలో పోరాట యోధుల చరిత్రను కేంద్ర ప్రభుత్వం భవిష్యత్ తరాలకు అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర మరుగున పడిందని, ఎంతో స్ఫూర్తినిచ్చే ఆయన చరిత్ర ఇప్పటి యువతకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. అందుకే ఆయన పేరుతో పోస్టల్ కవర్ తెచ్చామని చెప్పారు. బుధవారం చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఎంపీ లక్ష్మణ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యతో కలిసి కేంద్ర మంత్రి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోస్టల్ కవర్‌ను ఆవిష్కరించి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఎందరో పోరాట యోధుల చరిత్రను కేంద్రం వెలుగులోకి తెచ్చిందన్నారు. కేంద్రం ఆధ్వర్యంలో గోల్కొండ కోటకు రూ. 10 కోట్లతో లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామని, భువనగిరి ఫోర్ట్‌ను డెవలప్ చేస్తామని చెప్పారు. కొండా లక్ష్మణ్ బాపూజీ పేరుతో త్వరలో ఓ కార్యక్రమం చేపడతామన్నారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ జీవిత చరిత్రను తెలిపే షార్ట్ ఫిల్మ్ ను ప్రదర్శించారు. లండన్ మ్యూజియంలో ఉన్న పాపన్న గౌడ్ ఫోటోను చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ విద్యా సాగర్ .. కిషన్‌రెడ్డికి అందజేశారు.
జిల్లాకో నీరా స్టాల్ ఏమాయె?: లక్ష్మణ్
సర్వాయి పాపన్న చరిత్రను సినిమాగా తేవాల్సి ఉండేదని, కానీ అది సఫలం కాలేదని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన ఎంతో మంది వీరుల చరిత్రను రాష్ట్ర పాలకులు కనుమరుగు చేశారని, వాళ్లను తెలంగాణ ప్రజలు క్షమించరన్నారు. తెలంగాణ తల్లి ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని, ఆ కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించాలన్నారు. అన్ని జిల్లాల్లో నీరా స్టాల్స్ అని గౌడ్స్ ను రాష్ట్ర సర్కారు నమ్మించి మోసం చేసిందన్నారు. గౌడ కార్మికులు చనిపోతే రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వట్లేదని, గీత కార్మికుల సొసైటీకి 5 ఎకరాల భూమి ఇవ్వలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక పాపన్న చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేరుస్తామని హామీ ఇచ్చారు. పాపన్న పోస్టల్ స్టాంప్ ఏర్పాటు చేసినందుకు ప్రధాని మోడీకి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్లో జవాబుదారీతనం లేదన్నారు. ప్రసాద్ స్కీమ్ కింద కిలాస్పూర్కు రూ.250 కోట్లు కేటాయించాలని కోరారు. పోస్టల్ కవర్ తీసుకురావడంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్ పాత్ర కీలకమైందని బీజేపీ యువ నేత తూళ్ల వీరేందర్ గౌడ్ తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, హరిశంకర్ గౌడ్, భరత్ గౌడ్, గౌడ సంఘాల ఐక్య వేదిక నేతలు పాల్గొన్నారు.