సివిల్ సప్లైస్ కార్పొరేష‌న్ చైర్మన్ గా స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్

రాష్ట్ర సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలు పదవిలో ఉండనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ కు ఆఫీసు, సిబ్బంది, వాహనం, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ శాఖకు సూచించింది. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్‌కు స‌ర్దార్ ర‌వీంద‌ర్ సింగ్ ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ ఇవాళ రవీందర్ సింగ్ కూతురు పెళ్లికి హాజరయ్యారు. ఆ తర్వాతనే సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ గా రవీందర్ సింగ్ ను నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు బయటకు రావడం కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.  

ముందుగా బీజేపీలో ఉన్న రవీందర్ సింగ్.. 2006లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా బీజేపీకి రాజీనామా చేసి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మూడు సార్లు  కరీంనగర్  కార్పొరేటర్ గా గెలిచిన ఆయన..2014లో మేయర్ గా పనిచేశారు.